మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎవరు కనిపించినా… మీ ఓటు ఏ గుర్తుకు వేస్తారు అని అడుగుతున్నారు.. ఎదుటి వారు తాను సైకిల్ గుర్తుకు వేస్తానని చెబుతున్నారు. దీంతో ఆయనకు ఓ డౌట్ వస్తోంది. అసలు వైసీపీ గుర్తు ఫ్యాన్ అనే సంగతిని మర్చిపోయారా లేకపోతే ఎవరికీ తెలియదా అనే డౌట్ వస్తోంది. దీన్ని ఆయన మనసులోనే ఉంచుకోవడం లేదు. అందరికీ చెబుతున్నారు. మన గుర్తు ఎవరికీ గుర్తు లేదని .. అందరికీ గుర్తు చేయాలని కోరుతున్నారు. ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి.
ధర్మాన ప్రసాదరావు ఇటీవలి కాలంలో ఇంతే వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. ఏదైనా సమావేశం పెడితె ఎవరికి ఓటేస్తారని సభకు వచ్చిన వారిని అడుగుతారు. వారు ఫ్యాన్ గురించి తప్ప మిగతా గుర్తుల గురించి చెబతారు. దీంతో ఆయన పలుమార్లు అసహనానికి గురయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. గత నాలుగు ఎన్నికల్లో మూడు సార్లు ఆయన విజయం సాధించారు. కానీ ఎప్పుడూ ఆయన మెజార్టీ పది వేల ఓట్ల దరి దాపుల్లోకి రాలేదు.
గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల తేడాతో గెలిస్తే జనసేన పార్టీకి ఏడున్నర వేల ఓట్లు వచ్చాయి. జనసేన ఓట్లు చీల్చబట్టి గత ఎన్నికల్లో ధర్మాన బయటపడ్డారు. లేకపోతే వరుసగా రెండో సారి ఓడిపోయేవారు. కానీ జనసేన పుణ్యమా అని ఆయన గెలవడతో పాటు రెండో టర్మ్ లో అయినా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి కాలంలో ఆయనకు ఓటమి భయం పట్టుకుందని అందుకే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. పోటీ చేయబోనంటూ చెప్పినా జగనే ఒత్తిడి చేసి నిలబెట్టారని పదే పదే చెప్పుకుంటున్నారు.