పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని చూస్తోన్న బీఆర్ఎస్ కు…కేసీఆర్ గతంలో అనుసరించిన విధానాలే శరాఘాతంగా మారనున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
దేశంలో ఉప ఎన్నికను సైతం కాస్ట్లీ ఎన్నికగా మార్చింది కేసీఆరే. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కొత్త పథకాలు, డబ్బు ప్రలోభాలతో ఎన్నికను నెగ్గాలని చూశారన్న ఆరోపణలు ఉన్నాయి. హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ వెదజల్లిన డబ్బు ప్రవాహమే అందుకు ఉదాహరణ. అధికారంలో ఉండటంతో అప్పుడు బీఆర్ఎస్ ఏం చేసినా చెల్లింది. ఇప్పుడు అధికారం పోయింది. వ్యవస్థలను మేనేజ్ చేసే అవకాశం లేదు. గతంలో ఆర్థిక వనరులను సమకూర్చిన వారెవరు ప్రస్తుతం పార్టీ వైపు చూడటం లేదు.
కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆర్థిక వనరులు ఆ పార్టీకి పరిపుష్టంగా అందుతాయనేది ఓపెన్ సీక్రెట్. బీఆర్ఎస్ ను ఆర్థికంగా ఎదుర్కోవడం ఇప్పుడు కాంగ్రెస్ కు ఈజీ. గతంలో ఆర్థిక వనరులనుపయోగించి ఉప ఎన్నికల్లో ఎలాంటి గేమ్ ప్లాన్ వేసి ప్రత్యర్థి పార్టీలను కేసీఆర్ ఓడించారో.. ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుందా..? అనేది తేలాల్సి ఉంది. కానీ,కేసీఆర్ ప్రయోగించిన అస్త్రాలనే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వాడితే అందుకు నిందించాల్సింది కేసీఆర్ నే. అదే సమయంలో బీఆర్ఎస్ మనీ పాలిటిక్స్ ను నాడు వ్యతిరేకించి ఇప్పుడు కాంగ్రెస్ అదే స్ట్రాటజీ అవలంభించడం ప్రజలు కోరుకున్న “మార్పు” కాదు.