”మమ్ము కాచిన వాడు మా మనసు దోచిన వాడు మంగళాకారుడు” అంటూ బాలు మధురమైన గాత్రంలో టైటిల్ పడగానే ‘దిల్ రాజు సినిమా. ఫ్యామిలీతో కలసి హాయిగా చూసేయొచ్చు” అనే నమ్మకం కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అలాంటి క్రెడిబిలిటీ సంపాయించుకుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీస్టార్’ నిర్మించారు దిల్ రాజు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మృణాల్ ఠాకూర్ కథానాయిక.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. కుటుంబం అంతా కలసి చూసే సినిమా అని చెబుతున్నారు. ప్రచార చిత్రాలు కూడా అలానే కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఇప్పుడు సెన్సార్ ముందుకు వెళ్ళింది. ఇందులో సెన్సార్ చేసిన డైలాగులు వున్నాయి. ‘ఎఫ్’ వర్డ్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బందిపడే కొన్ని అభ్యంతరకరమైన డైలాగులు వున్నాయి. వాటన్నిటికి మ్యూట్ సౌండ్ వేయమని అదేశించింది సెన్సార్ బోర్డ్.
అయితే మ్యూట్ సౌండ్ వేసినప్పటికీ ఆ పదాల్లో వుండే మోటుతనం ప్రేక్షకులకు అర్ధమౌతుంది. దిల్ రాజు సినిమా, పైగా ఫ్యామిలీ కంటెంట్ వున్న ఇలాంటి సినిమాలో కూడా అలాంటి సెన్సార్ డైలాగులు ఎందుకు రాయాల్సివచ్చిందో సినిమా చూస్తే గానీ తెలీదు.