ఎన్నికల ప్రచార చిత్రాలుగా చాలా సినిమాలు నేరుగా థియేటర్స్ లో విడుదలయ్యాయి. అయితే ఇందులో ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ద్రుష్టిని ఆకర్షించలేదు. చర్చించుకునేలా చేయలేదు. కానీ నేరుగా ఆన్ లైన్ లో విడుదలైన ‘వివేకం’ సినిమా మాత్రం సంచలనం సృష్టించింది. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా నేరుగా ఆన్ లైన్ వేదికల్లో విడుదల చేసిన ఈ సినిమాలో నిజాలని నిర్భయంగా చూపించారు. ఈ సినిమాని నెటిజన్స్ విపరీతంగా చూశారు. ఇందులో కంటెంట్ వైరల్ అయ్యింది. ఈ సినిమా దెబ్బకి బయపడిన జగన్ సర్కార్ లింకులని తీయించే ప్రయత్నం చేసింది. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. ఒక లింక్ తీస్తే వందలింకులు పుట్టుకొచ్చాయి.
తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఈ సినిమా గురించి స్పందించారు. ”వివేకం సినిమాను ఎవరో కానీ చాలా ధైర్యంగా తీశారు. ఆ సినిమా చివరి అరగంట చూస్తే చాలా భయం వేసింది. ఆ సన్నివేశాలు చూడలేక కళ్లు మూసుకున్నా. అందులో చూపించిన దానికంటే వాస్తవాలు ఇంకా దారుణంగా వున్నాయి” ఆమె చెప్పారు.
సునీత స్టేట్మెంట్ తర్వాత ‘వివేకం’ సినిమాపై జనాల్లో మరింత ఆసక్తి పెరిగింది. సునీత వాఖ్యలని వార్తల్లో చూసిన చాలా మంది ఆ సినిమా కోసం వెదికారు. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి ఇంటిల్లాపాది సినిమాని చూస్తున్నారు. ఇక యూట్యూబ్ తో పాటు మిగతా వేదికలపై వున్న లింక్స్ లోని వ్యూస్ మరింతగా పెరిగాయి. సినిమా కంటే వాస్తవాలు ఇంకా దారుణంగా వున్నాయని సునీత చెప్పడం చూస్తుంటే ‘హూ కిల్డ్ బాబాయ్’ ఎపిసోడ్ పై భవిష్యత్ లో ఇంకొన్ని సినిమాలు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే .. జరిగిన దారుణం అంత దుర్మార్గమైనది.