కేసీఆర్ రైతు రాజకీయం స్టార్ట్ చేయడంతో తానేం తక్కువ అన్నట్లుగా బండి సంజయ్ కూడా రైతు రాగం అలపించారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు. ఇప్పటికే కేసీఆర్ రైతు రాజకీయంపై తీవ్ర విమర్శల జడివాన కురుస్తోన్న వేళ బండి సంజయ్ కూడా అదే ట్రాక్ లో వెళ్లి వ్యూహాత్మక తప్పిదం చేశారన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి.
బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే రైతులు గుర్తుకొచ్చారన్న విమర్శలను కేసీఆర్ మూటగట్టుకున్నారు. ఆయన హయాంలో రైతులకు జరిగిన అన్యాయాలు, అవమానాలను జిల్లాల పర్యటనలతో కేసీఆర్ తవ్వి తీసుకున్నట్లు అయింది. ఇప్పుడు బండి సంజయ్ కూడా ముందు వెనకా ఆలోచించకుండా దీక్ష చేపట్టి బీజేపీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.
రాజకీయం అన్నాక ఇలాంటి లోటుపాట్లను ఆలోచిస్తూ పోతే రాజకీయం చేయలేమనేది ఓపెన్ సీక్రెట్. కానీ, లోక్ సభ ఎన్నికల వేళ ఇలాంటి రాజకీయం సరికాదు. ఎందుకంటే బండి సంజయ్ రైతు దీక్ష చేయగానే కాంగ్రెస్ ఎదురుదాడి మొదలు పెట్టింది. బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్నారు..? ఏమైంది..? అని బీజేపీని డిఫెన్స్ లో పడేసేలా కౌంటర్ స్టార్ట్ చేసింది.
ఇది లోక్ సభ ఎన్నికల వేళ రైతాంగాన్ని ఆలోచింపజేసేదే. సో, ఈ తరహా రాజకీయాలు ఎన్నికల వేళ వ్యూహాత్మక తప్పిదం అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.