పదేళ్ళ పాలనలో చేసినవి చెప్పుకోలేకే ఓడిపోయామని కేటీఆర్ ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమీక్షల సమావేశాల్లో తమ వైపు ఏం లోపం లేదు.. అంతా బాగా చేశామని కానీ తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కావడం లేదన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. తమ ఓటమికి కారణాలు తెలుసుకునేందుకు.. నిజాయితీగా ఆయన ఇప్పటికీ ప్రయత్నించడం లేదు.
కాంగ్రెస్ దొంగహామీలిచ్చి జనాలను మోసంచేసి ఓట్లేయించుకున్నదని గట్టిగా నమ్ముతున్నారు. బీఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది.. అప్పుడు ఇచ్చిన హామీల ప్రకారం చూస్తే.. బీఆర్ఎస్ కూడా మోసం చేసినట్లే కదా అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. చెప్పిన గ్యారంటీల్ని వీలైనంత త్వరగా లోక్ సభ ఎన్నికల కోసమైనా అమల్లోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. కానీ బీఆర్ఎస్ రెండో సారి గెలవడానికి చేసిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. రుణమాఫీ దగ్గర నుంచి నిరుద్యోగ భృతి వరకూ ప్రతీ విషయంలోనూ ఉల్లంఘించారు. మరి రెండో సారి గెలుపును ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి.
నిజానికి చేసిన దాని కన్నా పదింతలు చెప్పుకోవడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. రీల్స్ దగ్గర నుంచి వైరల్ కంటెంట్ వరకూ సోషల్ మీడియాలో దున్నేశారు. ఇక మీడియా సంగతిచెప్పాల్సిన పని లేదు. ఇంత పాజిటివ్ పబ్లిసిటీ చేయించుకున్న తర్వాత కూడా చేసిన మేలు చెప్పుకోలేక ఓడిపోయామని చెప్పటం కేటీయార్ కే చెల్లిందన్న విమర్శలు వస్తున్నాయి.
మీడియాను గుప్పిట్లో పెట్టుకుని తన పాలనపై నెగిటివ్ వార్తలు, కథనాలు రాకుండా కేసీయార్ చూసుకోవటంవల్ల జనాల్లో ఉన్న వ్యతిరేకత కనబడలేదు. జనాల్లో వ్యతిరేకత ఉందని తెలిసినా కేసీయార్ పట్టించుకోలేదు. పాజిటివ్ వార్తలు, కథనాలు, డబ్బు, అధికారమే తమను మూడోసారి అధికారంలోకి తెస్తుందని కేసీయార్ భ్రమల్లో ముణిగిపోయారు. ఆ అతివిశ్వాసమే చివరకు కొంపముంచేసింది. దాన్ని ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది.