సీఎం కేసీఆర్ ఉన్నంతకాలం సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల అనగానే… రిచ్ నియోజకవర్గాలు అనే ముద్రపడింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం ఎవరూ ఊహించనంత ఫాస్ట్ గా పరుగెత్తింది. భూముల రేట్లు ఆకాశాన్నంటాయి. కానీ, బీఆర్ఎస్ సర్కార్ పోగానే అక్కడ పరిస్థితి దారుణంగా మారిపోయింది.
కేవలం మూడు నెలల్లోనే ఆ మూడు నియోజకవర్గాల్లో పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో రియల్ రంగం ఘోరంగా పడిపోయింది. అంతకు ముందు రోజుల్లో లక్షలు పెరిగిన ప్లేసులు సైతం ఇప్పుడు అమ్ముడుపోని పరిస్థితి నెలకొంది.
గజ్వేల్ పరిధిలోని రిజిస్ట్రేషన్ల ఆదాయం సగానికి సగం పడిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2022-23లో గజ్వేల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 12,957డాక్యుమెంట్లు నమోదయ్యాయి. ప్రభుత్వానికి 58.88కోట్ల ఆదాయం వచ్చింది. కానీ 2023-24 వచ్చే సరికి దాదాపు 40శాతం కోత పడి 39కోట్లకు పరిమితం అయ్యింది. ఇందులోనూ ఎన్నికలకు ముందు జరిగిన క్రయవిక్రయాలే ఎక్కువ.
వ్యవసాయేతర భూముల పరిస్థితి కూడా అంతే. రోజులు గడిచిన కొద్ది కోటికి పైగా పలికిన ఎకరం ధర ఇప్పుడు 70లక్షలకు పడిపోయింది. అయినా కొనే వారు కరువయ్యారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పడిపోయే అవకాశం కనపడుతోంది.
అయితే, ఇది తాత్కాలికమేనని… రీజినల్ రింగ్ రోడ్డు వస్తే మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉందని స్థానిక నేతలంటున్నా, గజ్వేల్ అభివృద్దికి నిధులు పెద్దగా రావన్న ఉద్దేశంతోనే రియల్ రంగం నేల చూపులు చూస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.