తెలంగాణలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తోన్న కార్పొరేట్ కాలేజ్ లపై రేవంత్ సర్కార్ కొరడా ఝుళిపించనుందా..? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
తెలంగాణలో కార్పొరేట్ కాలేజ్ లు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తుండటంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పలు రకాల ఫీజ్ ల పేరుతో విద్యార్థులను వేధింపులకు గురి చేయడంతో పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ విషయమై గతంలో ఫిర్యాదులు అందినా ప్రభుత్వ పెద్దలు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కారణం.. బీఆర్ఎస్ లో కీలంగా వ్యవహరించిన నేతలకు కార్పొరేట్ విద్యా సంస్థలు ఉండటమే. ప్రభుత్వం మారడంతో కార్పొరేట్ కాలేజ్ ల ఫీజ్ దోపిడీపై దృష్టి సారించింది.
అనుమతులు లేకుండా కొనసాగుతోన్న కార్పొరేట్ కాలేజ్ లపై చర్యలు చేపట్టడమే కాకుండా.. ఫీజ్ ల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల అనంతరం అసెంబ్లీని సమావేశపరిచి కార్పొరేట్ కాలేజ్ లను నియంత్రించేందుకు కొత్త చట్టం తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతన్నాయి. కార్పొరేట్ కాలేజ్ లపై తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందటంతో ఫీజ్ నియంత్రణ చట్టం తీసుకొచ్చేందుకు కసరత్తు చేయాలని అధికారులకు ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది.