తెలంగాణలో ట్యాపింగ్ బాధితుల్లో బీజేపీ పెద్దలు కూడా ఉన్నారని వ్యూహాత్మకంగా లీక్ ఇచ్చారు తెలంగాణ పోలీసులు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో వెలుగు చూసిన పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో .. అసలు తప్పు ట్యాపింగ్ దేనని పోలీసులు తేల్చారు. ఈ కేసులో కేసీఆర్ చేసిన ఓవరాక్షన్ బీజేపీ నేతల్ని కూడా చిరాకు పెట్టింది. మీకు పోలీసులు ఉన్నారు..మాకు ఉన్నారంటూ ఏకంగా బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయించేందుకు పోలీసుల్ని పంపారు. ఆ కేసు న్యాయస్థానాలకు చేరి.. ప్రస్తుతానికి ఎటూ కాకుండా ఉండిపోయింది.
ఇప్పుడీ కేసులో తెలంగాణ పోలీసులు తెర వెనుక జరిగిన విషయాలను వెలుగులోకి తెచ్చినట్లుగా లీకులు ఇచ్చారు. అసలు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోదామనుకున్నారు. చర్చలు జరిపారు. అయితే వారిపై నిఘా పెట్టిన ప్రణీత్ రావు టీం .. విషయం తెలుసుకుని బీఆర్ఎస్ పెద్దలకు ఇచ్చారు. బీఆర్ఎస్ పెద్దలు వెంటనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి స్కెచ్ అమలు చేశారు. నలుగురు ఎమ్మెల్యేల్ని పిలిచి బెదిరించో.. బామాలో.. స్కెచ్ అమలుకు ఒప్పించారు. ఫామ్ హౌస్ లో కలిసే ముందు రోజు ప్రస్తుతం అరెస్టయిన రాధాకిషన్ రావు నేతృత్వంలోని టీమ్ కెమెరాలు.. రికార్డర్లు పెట్టింది.
అనుకున్న విధంగా ట్రాప్ చేసిన తర్వాత సెలక్టివ్ వీడియోలు , ఫోటోలు విడుదల చేశారు. తర్వాత ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు బీఆర్ఎస్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ, కేరళ వెళ్లారు. నోటీసులు ఇచ్చేందుకే స్పెషల్ ప్లైట్లలో వెళ్లారు. నిజానికి ఇవన్నీ కొంత కాలంగా గుసగసుల్లో ఉన్న వార్తలే. వాటిని పోలీసులు లీక్ చేశారు. రాధాకిషన్ రావు మొత్తం చెప్పేశారని పోలీసుల లీక్.
ఈ కేసు బయటపడిన తర్వాత చాలా రోజుల పాటు ఆ నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ వెంటనే ఉన్నారు. ఫామ్ హౌస్ లోనే నెల రోజుల పాటు ఉన్నారు. తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ.. కోర్టు నిర్ణయం తీసుకుంది. సీఎంగా ఉన్న కేసీఆర్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించారని. అవి ఎలా లీక్ అయ్యాయో తేలాల్సి ఉందన్నారు. అయితే సీబీఐకి ఈ కేసును అప్పగించడంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. స్టే ఆదేశాలు లేకపోయినప్పటికీ.. సీబీఐ విచారణ ప్రారంభించలేదు.