చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. ప్రజల ప్రజల ఆకాంక్షల మేరకే తాను వైసీపీ నుంచి బయటకు వస్తున్నానని ..9వ తేదీన ప్రజల మధ్యనే తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీని నమ్ముకుని నిండా మునిగిపోయాడు. చివరికి ఆయనకు టిక్కెట్ లేకుండా చేసి.. రాజకీయంగా నిర్వీర్యం చేసేశారు. తనపై జరిగిన కుట్ర గురించి తెలుసుకునేలోపే.. ఆయన న్యాయమూర్తుల్ని తిట్టిన కేసుల్ని కూడా నెత్తిన మోస్తూ.. క్రాస్ రోడ్స్ లో నిలబడ్డారు. ఇప్పుడు ఆయనకు పార్టీ నీడ లేకుండా పోయింది.
2014లో ఇండిపెండెంట్గా గెలిచిన ఆమంచి.. అధికారంలో ఉండటంతో టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. నంద్యాల ఉపఎన్నికల సమయంలో ఆయన ఓ మండలానికి ఇంచార్జ్ గా వ్యవహరించి మంచి ఫలితం తెచ్చారు. దీంతో చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. 2019లో టిక్కెట్ కూడా ఖరారు చేశారు. కానీ చివరి క్షణంలో చంద్రబాబును, టీడీపీని తిట్టేసి వైసీపీలో చేరిపోయారు.
చంద్రబాబు వెంటనే కరణం బలరాంను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఎన్నికల్లో వైసీపీ వేవ్ వీచినా ఆమంచి ఓడిపోయారు. అప్పట్నుంచి ఆయనకు ఉక్కపోత ప్రారంభమయింది. కరణంను టీడీపీలో చేర్చుకుని .. ఆమంచికి ప్రాధాన్యం తగ్గించారు. చివరికి ఆయనను అసలు గెలుపు ఆశలు లేని పర్చూరుకు బలవంతంగా పంపించారు. అయితే చీరాలను విడిచిపెట్టే ఉద్దేశం లేని ఆమంచి.. చివరి వరకూ ప్రయత్నించారు. అయినా వైసీపీ హైకమాండ్ పట్టించుకోలేదు. చీరాలలో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలియడంతో ఆయనను పర్చూరు ఇంచార్జ్ పదవి నుంచి కూడా తప్పించింది.
ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకపోవడం.. తన రాజకీయ భవిష్యత్ ను గంగలో కలిపే ప్రయత్నం చేయడంతో ఆమంచి.. చివరికి బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆయనకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తలుపులు కూడా మూసుకుపోయాయి.