” తల్లి నిజం – తండ్రి నమ్మకం ” కాస్త కటువుగా ఉన్నా ఇది వంద శాతం ఫ్యాక్ట్. దీన్నే భారత ప్రజాస్వామ్యానికి అన్వయిస్తే.. బ్యాలెట్ ఎన్నికలు నిజం – ఈవీఎంలు నమ్మకం అనుకోవాలి. ఎందుకంటే కళ్ల ముందు కనిపించే ఓట్లు నిజం. మరి ఈవీఎంలలో పడే ఓట్లు కేవలం నమ్మకం.. ఇంకా చెప్పాలంటే నమ్మి తీరాలి. అంతకు మించిన మార్గం లేదు. బలవంతంగా నమ్మించే ఓటింగ్ ప్రక్రియ ద్వారా మన ప్రజాస్వామ్యం బలపడుతుందా.. బలహీనపడుతుందా ?. గత కొన్నాళ్లుగా భారత్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై ఎన్నెన్నో సందేహాలు ఉన్నాయి. అంచనాలు వేయలేని ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. అలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు.. అదే ప్రజాతీర్పు అని గట్టిగా ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే నిజం కళ్ల ముందు లేదు. మళ్లీ మళ్లీ లెక్కించుకోవడానికి బ్యాలెట్ పేపర్లు లేవు. మెషిన్లే ఉన్నాయి. ఆ మెషిన్లలో ఎంత నెంబర్ చూపిస్తే.. అన్ని ఓట్లు ఆయా పార్టీలకు పడ్డాయని నమ్మాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈవీఎం ప్రజాస్వామ్యం మనకెందుకు ?
అమెరికా, జపాన్ లాంటి దేశాల్లోనూ బ్యాలెట్లే !
ప్రపంచంలో బాగా చదువుకున్న వాళ్లు, టెక్నాలజీ మీద మంచి అవగాహన ఉన్న వాళ్లు ఏ దేశాల్లో ఉంటారు.. జపాన్, అమెరికా, జర్మనీ లాంటి దేశాల్లో ఉంటారు. అవి అభినృద్ధి చెందిన దేశాలు. వారి ప్రజల జీవనాన్ని టెక్నాలజీతో సులభతరం చేశాయి. ఎలాంటి సమస్యకు అయినా సాంకేతికతో పరిష్కరించి పౌరుల మెప్పును పొందుతాయి. కానీ ఆయా దేశాల్లో ఎన్నికలు ఎలా జరుగుతాయి ?. సంపూర్ణంగా బ్యాలెట్ పద్దతిలో జరుగుతాయి. టెక్నాలజీలో అంత అడ్వాన్సుడ్ గా ఉన్న దేశాలు ఎన్నికలను ఈవీఎంలలో ఎందుకు నిర్వహించడం లేదు ? ఎందుకంటే వారికి ట్యాంపర్ చేయలేని టెక్నాలజీ అంటూ ఏదీ లేదని తెలుసు మరి. టెక్నికల్‌గా ట్యాంపర్ చేయలేని చిప్ అంటూ ప్రపంచంలో లేనే లేదు. అసలు సంబంధమే లేని ఫోన్ చొరబడి మొత్తం సమాచారం చోరీ చేస్తున్నారు. అలాంటిది ఓ చిప్ ను ట్యాంపర్ చేయలేరా ?. చేయలేరు అని వాదిస్తే అంత కంటే తెలివి తక్కువ పని ఉండదు. ఎందుకంటే ఆ చిప్ తయారు చేసింది కూడా మనిషి విజ్ఞానమే. మరి దాన్ని ట్యాంపర్ చేయడం ఆ మనిషి విజ్ఞానానికి చేతకాదా ?.
ప్రజాస్వామ్యానికి పునాది నమ్మకం !
అధికారం కోసం దేనికైనా సిద్ధపడే రాజకీయం మనది. ప్రజాస్వామ్యానికి పునాది నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టి తమది అసలైన.. ఖచ్చితమైన ప్రజాస్వామ్య దేశమని.. తమ పౌరుల హక్కులన కాపాడతామని గట్టి నమ్మకం ప్రజల్లో ఉంచడానికే టెక్నికల్‌గా అత్యున్నత స్థాయిలో ఉన్న దేశాలు కూడా బ్యాలెట్ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. కానీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఏం జరుగుతోంది ? ఎన్నో అనుమానాలు ఉన్న ఈవీఎంలతో… లెక్కకు మించి వస్తున్న అభ్యంతరాలతో కూడా నిర్వహిస్తున్నారు. ఈవిఎంలలో ప్రొగ్రామింగ్ చేసే చిప్‌నకు సంబంధించిన అంశంపై సాంకేతిక నిపుణుల అనుమానాలకు సరైన సమాధానం రాలేదు. ఈవీఎం చిప్ కేవలం ఒకేసారి ఉపయోగించబడేది అని ఎన్నికల సంఘం గతంలో స్పష్టం చేసిది. అయితే ఆ చిప్‌ను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నామని తర్వాత ఒక సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిది. “జన్ ఆందోళన్” సంస్థ.. వివిధ మార్గాల్లో ఎన్నికల అవకతవకలను గుర్తించి.. ఉద్యమం కూడా చేసింది. పోలయిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లను లెక్కించడం.. ఈవీఎంలో ఓట్లకు.. వీవీ ప్యాట్ల లెక్కలకు తేడా ఉండటం అనేది చాలా ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులు. గత పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 372 స్థానాల్లో పోలైన ఓట్ల కంటే, రికార్డయిన ఓట్లు అధికంగా నమోదయ్యాయి. దాంతోపాటు నిబంధనల ప్రకారం ఓటేసే సమయంలో నిబంధనల ప్రకారం వివిప్యాట్ ఏడు సెకన్ల పాటు కనిపించాలని, కానీ చాలా ప్రాంతాల్లో మూడు సెకన్లే కనిపించింది. అంటే రీ ప్రోగ్రామింగ్ చేశారు Rవిఎంలలో ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్లేంటన్నది ఎవరికీ తెలియదు.
ఈవీఎంలపై అన్ని పార్టీల వ్యతిరేకత – కాకపోతే ఓడినప్పుడే !
నిజానికి ఈవీఎంలను వ్యతిరేకించని పార్టీ లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈవీఎంలు వద్దు బ్యాలెట్టే ముద్దు అని బీజేపీ ఉద్యమం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పని చేస్తోంది. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడూ ఈవీఎంలు వద్దనే చెబుతూంటాయి. కానీ తమ వాదన ఎలా ఉన్నా.. ఫలితాల్లో తాము గెలిచిన తర్వాత మాత్రం సైలెంట్ అయిపోతాయి. దాని వల్లే.. ఈవీఎంలపై రాజకీయ పార్టీలు చీలిపోతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా వివిధ పార్టీలు పేపర్ బ్యాలెట్లకు తిరిగి తేవాలని లేదా ఓటర్- వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ ను మెరుగుపరచాలని డిమాండ్ చేశాయి. ఓటు వేసిన అభ్యర్థి గుర్తుతో కూడిన ప్రింటెడ్ పేపర్ స్లిప్ సీలు చేసిన పెట్టెలో వేయడానికి ముందు ఓటరుకు ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. దాని కాపీని ఓటరుకు ఇవ్వాలని, అంతే కాకుండా ఆ స్లిప్పై ఓటు వేసిన తేదీ, సమయం కూడా ఉండాలని విపక్ష నాయకులు సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేశారు. వీవీ పాట్లను పూర్తి స్థాయిలో లెక్కించాలన్న డిమాండ్‌కూ మోక్షం కలగలేదు. అది పరోక్ష మార్గాల ద్వారా పేపర్ బ్యాలెట్లను తిరిగి ప్రవేశపెట్టినట్లే అవుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ అనుమానాల మధ్యే మరోసారి లోక్‌సభ ఎన్నికలుక రంగం సిద్ధమయింది.
సాంకేతిక నిపుణుల్లోనూ ఈవీఎంలపై అనుమానాలే !
సాంకేతిక నిపుణుల్లో కూడా ఈవిఎంల విషయంలో ఏకాభిప్రాయం లేదు. వీటి వల్ల పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరగడానికి అవకాశం లేదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. కానీ ఎంపిక చేసిన ఈవీఎంలో లెక్కల తారు మారు చేయవచ్చని చాలా మంది వాదిస్తున్నారు. ఎన్నికల ఫలితం తారుమారు కావాలంటే అన్ని ఈవీఎంలలో మార్పులు అవసరం లేదు. ప్రతి నియోజకవర్గంలో పది నుంచి పదిహేను ఈవీఎంలలో మార్పులు చేస్తే.. ఫలితం మారిపోతుంది. కనీసం వీవీ పాట్ స్లిప్ లను 100 శాతం లెక్కించాలని, తుది ఫలితాల ప్రకటనకు స్లిప్‌ల లెక్కే పరిగణనలోకి తీసుకోవాలని ఆగస్టు 2023లో 79 మంది రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. స్లిప్‌లపై అభ్యర్థి సంఖ్య, పార్టీ మొదలైన వాటి పేరును ముద్రించడంతో పాటు, ఆ కాగితంపై బార్‌కోడ్‌ను కూడా ముద్రించాలి. బార్కోడ్ ఆధారంగా లెక్కింపు జరగాలని వారు కోరారు. సోర్స్ కోడ్లను ఎవరూ రహస్యంగా ఉంచరు. సోర్స్ కోడ్ ఇతర విషయాలతో పాటు పబ్లిక్ చేసిన తర్వాత కూడా యంత్రాలు సురక్షితంగా ఉండాలి. వాస్తవానికి హ్యాకింగ్‌కి తట్టుకొని యంత్రాలు సురక్షితంగా ఉన్నాయని నిరూపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందనేది నిపుణుల అభిప్రాయం.
భారత ప్రజాస్వామ్యంపై అంతర్జాతీయంగానూ సందేహాలు !
ఈవీఎంల వల్ల అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అంతర్జాతీయంగా పొందిన గుర్తింపు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణ సందేహాస్పదంగా మారింది. పార్టీలకు సమాన అవకాశాలను ఎన్నికల కమిషన్ ఇవ్వడం లేదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయంగా కొంత మంది టెక్నాలజీ నిపుణులు, సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తే.. వెంటనే మన దేశ అంతర్గత విషయాల్లో విదేశీ శక్తుల చొరబాటు అంటూ.. వాటిపై దండెత్తడానికి ఇక్కడ ఓ సమూహం రెడీగా ఉంటుంది. చాలా మందికి ఇది నిజమే కదా అనిపిస్తుంది. కానీ .. మన చుట్టూ ఏం జరుగుతుందో మన తెలుసుకోలేనంతగా.. రాజకీయాలు.. రాజకీయ. పార్టీలు మన చుట్టూ ఓ మాయా ప్రపంచాన్ని సృష్టించి పెట్టాయి. అందులో మనం భాగంగా మారిపోయాం. దేశంలో ఏం జరుగుతుందో.. బయట నుంచి చూస్తేనే అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈవిఎంలపై అనుమానాలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న చోట ఎన్నికల ప్రక్రియకు అర్థమేమిటి? ఇవిఎంలు వాడుతున్న కొన్ని దేశాలు ప్రజల, పార్టీల కోరిక మేరకు వాటిని పక్కనపెట్టాయి. మన దేశంలోనూ అలా చేస్తేనే ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరుగుతుంది. లేకపోతే ఫలితాలు వచ్చినప్పుడు గెలిచిన వారు మాత్రమే నమ్ముతారు. మిగిలిన ఎవరూ నమ్మరు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
ప్రజా చైతన్యమే పరిష్కారం !
ప్రస్తుతం భారత ప్రజాస్వామ్యం చేయిదాటిపోలేదు. కానీ పోయే దశలో ఉందనేది ఎక్కువ మంది అభిప్రాయం. వ్యవస్థలన్నీ ఒక వైపు వంగిపోతూండటం.. విపక్షాలన్నింటినీ నిర్వీర్యం చేయడం.. ప్రతిపక్షం అనేది లేకండా పాలన చేయాలని అధికారంలో ఉండే పార్టీలన్నీ ఉవ్విళ్లూరడం క్రమంగా పెరుగుతోంది. ఒక్క సారి అధికారం వస్తే జీవితాంతం తమ గుప్పిట్లో ఉంచుకుంటామనే ఆధునిక నియంతలు పెరిగిపోతున్నారు. వారికి అలాంటి ధైర్యం ఎలా వస్తుందో ?.. రాజ్యాంగం పట్ల ఎందుకు కనీస భయం ఉండటం లేదో ప్రజలు గుర్తించాలి . దీనంతటికి పరిష్కారం.. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచుకోవడం.. ఆ నమ్మకం పెరగాలంటే. మన ఓటు మన కళ్ల ముందు కనిపించాలి మెషిన్లో కలిసిపోతే ఎప్పటికైనా అనుమానమే. అందుకే ప్రజలు చైతన్యం తెచ్చుకుని బ్యాలెట్ కోసం పోరాడితేనే.. మన స్వేచ్చ మనకు మిగిలి ఉంటుంది. లేకపోతే ఎంత గడ్డు పరిస్థితి చూస్తామో అంచనా వేయడం కష్టం అవుతుంది.