The Family Star Movie Telugu Review
తెలుగు360 రేటింగ్ : 2.25/5
-అన్వర్
పెళ్లిచూపులతో హీరో అయ్యాడు. అర్జున్ రెడ్డితో స్టార్‌గా మారిపోయాడు. పది హిట్లు కొట్టినా రాని క్రేజ్… ఈ రెండు సినిమాలకే సంపాదించేశాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం మరో మైల్ స్టోన్. ‘ఇక విజయ్‌కి తిరుగులేదు’ అని టాలీవుడ్ కూడా ఫిక్సయిపోయిన తరుణంలో ఒక్కో కళాఖండాన్ని వదులుతున్నాడు దేవరకొండ. ‘నోటా’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘డియర్ కామ్రేడ్’, ‘లైగర్’… ఇలా ఆ పరాజయ పరంపర కొనసాగింది. విజయ్ సినిమాలు ఫ్లాప్ అవ్వడం ఒక ఎత్తయితే, తన ఆటిట్యూడ్ మరో ఎత్తు! ‘లైగర్’ సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కొన్ని స్టేట్‌మెంట్లు గుప్పించాడు. దాంతో ట్రోలర్స్‌కి దొరికిపోయాడు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్న వేళ… తనకు ఓ క్లీన్ అండ్ నీట్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో జట్టు కట్టాడు. వీరిద్దరి కాంబోకి దిల్ రాజు బ్రాండ్ తోడైంది. దానికి ‘ఫ్యామిలీ స్టార్’ అనే చక్కటి ఫ్యామిలీ టైటిల్ దొరికింది. అందుకే ‘ఈసారైనా రౌడీ బోయ్ హిట్ కొడతాడన్న’ నమ్మకం కలిగింది. విజయ్ కూడా ఇదివరకటిలా కాకుండా కూల్ గా కామ్ గా మాట్లాడడం నేర్చుకొన్నాడు. మరి… ఇంత పాజిటీవ్ బజ్ తో బయటకు వచ్చిన `ఫ్యామిలీ స్టార్` ఎలా ఉంది? విజయ్ విజయదాహాన్ని తీర్చిందా?
గోవర్థన్ (విజయ్ దేవరకొండ)ది పక్కా మిడిల్ క్లాస్. ఇద్దరు అన్నయ్యలు, వాళ్ల పిల్లలు…. ఆ బాధ్యత కూడా తనే తీసుకొంటాడు. వదినల్ని గౌరవంగా చూసుకొంటాడు. తన పెత్తనంతో ఇంటినీ, ఖర్చుల్ని అదుపులో పెట్టుకొంటాడు. ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకోడు. గోవర్థన్ పెంట్ హోస్‌లోకి ఇందు (మృణాల్ ఠాకూర్) అద్దెకు వస్తుంది. మెల్లగా.. గోవర్థన్ కుటుంబంతో కలిసిపోతుంది. గోవర్థన్‌కీ, ఇందుకీ మధ్య ప్రేమ చిగురిస్తుంది. గోవర్థన్ తన కుటుంబంలోకి ఇందును ప్రేమ పూర్వకంగా ఆహ్వానించే తరుణంలో…ఇందు గురించిన ఓ నిజం తెలుస్తుంది. తన ఇంటికి ఇందు కావాలనే వచ్చిందని, దాని వెనుక ఓ మిషన్ ఉందని అర్థం అవుతుంది. అప్పుడు గోవర్థన్ ఏం చేశాడు? అసలింతకీ ఇందు… గోవర్థన్ ఇంటికి ఎందుకు వచ్చింది? ఆ తరవాత ఏం జరిగింది? అనేదే కథ.
ఫ్యామిలీ కథల్లో కొత్తదనం వెదుక్కోవాల్సిన పనిలేదు. ఎందుకంటే కుటుంబ బంధాలు, వాటి చుట్టూ అల్లుకొన్న కథలు కాస్త రొటీన్‌గానే అనిపిస్తాయి. ‘ఫ్యామిలీ స్టార్’ కథలోనూ కొత్తదనం కనిపించదు. ‘గీత గోవిందం’ లాంటి సింపుల్ కథని… చాలా గొప్పగా ఆవిష్కరించి రూ.100 కోట్లు కొట్టాడు పరశురామ్. కాబట్టి.. తనపై నమ్మకంతో కథ అటూ ఇటుగా ఉన్నా విజయ్, దిల్ రాజు ఓకే చెప్పేసి ఉంటారు. కుటుంబ భారాన్నంతా మోస్తున్న ఓ చిన్న కొడుకు… తన థీసెస్ కోసం ఇంటి డ్రామాని తన సొంత ప్రయోజనాల కోసం వాడుకొన్న హీరోయిన్ – ఇద్దరి మధ్య ప్రేమ, గొడవలు, కలుసుకోవడం – స్థూలంగా ఇదీ కథ. మాస్ ఇమేజ్ ఉన్న విజయ్ లాంటి హీరో.. కట్ బనియన్ వేసుకొని, లుంగీ కట్టుకొని, అటూ ఇటూ తిరగడం, ఆధార్ కార్డులు పట్టుకొని, ఉల్లిపాయల కోసం క్యూ లో నిలబడడం.. ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి.. తొలి సన్నివేశాలతో, హీరో క్యారెక్టరైజేషన్‌తో పెద్దగా ఇబ్బంది ఏం ఉండదు. పైగా… గోవర్థన్ పాత్ర మెల్లమెల్లగా ప్రేక్షకులకు ఎక్కేస్తుంది కూడా. అయితే సినిమా అంటే క్యారెక్టరైజేషన్, కొన్ని సన్నివేశాలు మాత్రమే కాదు. సంఘర్షణ. ఆ సంఘర్షణే… ఈ సినిమాలో లోపించింది. ఇంట్రవెల్ బ్యాంగ్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కానీ, హీరో – హీరోయిన్ల మధ్య వైరం ఎందుకు వచ్చింది? అనే పాయింట్ చాలా బలహీనంగా ఉంది. హీరోది అతి జాగ్రత్తతో, పిసినారి తనమో అర్థం కాదు. ఆ విషయంలో దర్శకుడు ఇంకాస్త క్లారిటీ చూపించాల్సింది.
అన్నయ్య తాగుడుకు బానిస. ఏదో లవ్ ఫెయిల్యూర్ స్టోరీలా… ఎప్పుడూ తూలుతూ కనిపిస్తుంటాడు. అదంతా చూస్తే.. అన్నయ్యకో బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉందనుకొంటాం. కానీ.. దాన్ని రివీల్ చేసినప్పుడు ‘మరీ ఇంత బలహీనంగా రాసుకొన్నాడేంటి ఈ సీన్లు’ అంటూ దర్శకుడిపై కాస్త కోపం వస్తుంది. సాధారణంగా రచయితలు దర్శకులు అయినప్పుడు కథలో సంఘర్షణ బలంగా పుట్టిస్తారు. కానీ అది ఈ సినిమాలో లోపించింది. తొలి సగంలో అక్కడ కొన్ని సీన్లు పండాయి. హీరో – హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కొన్ని సీన్లు నడిపించింది. అయితే.. సెకండాఫ్‌లో అది కూడా లేదు. బొత్తిగా నీరసంగా, ఓ టీవీ సీరియల్ లా సాగదీశారు. కథలో కాన్‌ఫ్లిక్ట్ బలహీనంగా ఉంటే, ద్వితీయార్థం ఎంత పేలవంగా రాసుకోవాల్సి వస్తుందో చెప్పడానికి ఈ సినిమా ఓ ఉదాహరణగా నిలుస్తుంది. సెకండాఫ్‌లో హీరోయిన్ పాత్ర మరీ బొమ్మలా మారిపోతుంటుంది. మహా అయితే పది డైలాగులు చెప్పించారేమో. మరీ అంత పాసీవ్‌గా ఆ పాత్రని డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. సినిమాలో ఫైట్లున్నాయి. బాగా డిజైన్ చేశారు కూడా. కానీ అవి కేవలం ఫైట్స్ కోసమే అన్నట్టు ఉండడమే ఇబ్బంది. తొలి ఫైట్‌లో హీరో కొట్టకుండానే కొట్టినంత ఇంపాక్ట్ తీసుకొచ్చారు. దాన్ని డిజైన్ చేసిన విధానం బాగుంది. కాకపోతే.. ప్రతీ ఫైటూ కావాలని ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. జగపతిబాబు – విజయ్‌ల మధ్య కాన్వర్జేషన్‌తోనే సినిమా అయిపోయింది. కానీ.. ఆ తరవాత సినిమా మరో 20 నిమిషాలు ఉంటుంది. కారణం.. మధ్యలో ఓ ఫైటు ఇరికించడం. క్లైమాక్స్‌లో ఫైట్ ఉండాల్సిందే అని ఫిక్సయి ఆ సీక్వెన్స్ ప్లాన్ చేశారేమో..? కల్యాణీ వచ్చా.. వచ్చా అనే పాట సినిమా అయిపోయాక రోలింగ్ టైటిల్స్‌లో వాడుకొన్నారు. అంటే.. ఓ పాటకు సరైన ప్లేస్‌మెంటే ఫిక్స్ చేయలేకపోయాడు దర్శకుడు. దాన్ని బట్టి స్క్రీన్ ప్లే ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు. క్లైమాక్స్ సైతం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది.
విజయ్ చూడ్డానికి బాగున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా కనిపించాడు. సినిమాని దాదాపుగా తన భుజాలపై మోశాడు. నటన, బాడీ లాంగ్వేజ్… ఈ విషయాల్లో పేరు పెట్టాల్సిన పనిలేదు. తన వరకూ మైనస్సులు కనిపించవు. మృణాల్ ఓకే అనిపిస్తుంది. సీతారామం లాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ కాదు. కొన్ని కొన్ని ఫ్రేముల్లో విజయ్ కంటే.. పెద్దదానిలా కనిపించింది. సెకండాఫ్‌లో ఈ పాత్రని పూర్తిగా సైలెంట్ చేసేశాడు దర్శకుడు. అందుకే మృణాల్‌కి కూడా పూర్తిగా ఓపెన్ అయ్యే స్కోప్ లేకుండా పోయింది. జగపతిబాబు రొటీన్ రిచ్ డాడ్ పాత్రలో… అలవాటైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఏదో లాగించేశాడు. వెన్నెల కిషోర్ ఉన్నా.. తన మార్క్ కామెడీ ఈ సినిమాలో కనిపించదు. రోహిణి అట్టంగడిని చూస్తే ఎందుకో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆమె చేసిన పాత్రే కళ్ల ముందు మెదులుతుంటుంది. ఆ పాత్రనే ఇక్కడా ప్రతిష్టించేశాడు దర్శకుడు.
రచయితలు దర్శకులు అయితే… స్క్రిప్టు పకడ్బందీగా ఉంటుంది. బలమైన కాన్‌ఫ్లిక్ట్ రాసుకొంటారు. అయితే…ఈ రెండు విషయాల్లోనూ పరశురామ్ చేతులెత్తేశాడు. డైలాగులు అక్కడక్కడ మెరుస్తాయి. అయితే.. ఓ సినిమాని హిట్ చేయడానికి ఈ ఎఫెక్ట్ సరిపోదు. విజువల్‌గా సినిమా బాగుంది. రిచ్‌నెస్ కనిపించింది. పాటలెందుకో ఎక్కలేదు. ‘గీత గోవిందం’లోని పాటలు ఇన్‌స్టెంట్ హిట్స్ అయ్యాయి. గోపీసుందర్ మ్యాజిక్ ఈ సినిమాలో పని చేయలేదు.
ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ట్రైలర్‌లోనూ బలంగా వాడారు. ”సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి, మందు ఉంది కదా అని తాగేసి, లిఫ్టులున్నాయి అని కదా అని ఎక్కేస్తే ఆరోగ్యం పాడైపోతుంది” అని. కాంబినేషన్లు కుదిరాయి కదా అని కథ లేకుండా, కాన్‌ఫ్లిక్ట్ లేకుండా సినిమాలు తీసేసినా అంతే అనారోగ్యం. తీసిన వాళ్లకూ.. చూసిన వాళ్లకూ!!
కామన్ మాన్ గురించి చెప్పడానికి హీరోయిన్ ఓ పుస్తకం రాయడానికి చేసిన ప్రయత్నం ఆ తరవాత జరిగిన పరిణామాలే ఈ సినిమా. ఫ్యామిలీమెన్ ఎంత గొప్పోడో చెప్పడానికి సినిమాలే తీయాలా ఏంటి? పుస్తకాలు అచ్చేస్తే సరిపోతుంది కదా.. ఏమంటారు..?
తెలుగు360 రేటింగ్ : 2.25/5
-అన్వర్