ఎన్నికల ప్రచార సభలో బుట్టా రేణుకను జగన్ పరిచయం చేస్తూ.. పాపం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనన్నారు. అవకాశం ఇస్తే సంపాదించుకుని ధనికురాలు అవుతుందన్నది జగన్ ఉద్దేశం ఏమో కానీ.. ఆమె మాత్రం తాను అప్పటికే కుబేరురాలినని మీడియా ఇంటర్యూల్లో చెప్పుకున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో చూపించిన ఆస్తులే అధికారికంగా రూ. మూడు వందల కోట్ల వరకూ ఉంటాయి. బహిరంగ మార్కెట్లో ఆ ఆస్తుల విలువ వెయ్యి నుంచి రెండు వేల కోట్ల వరకూ ఉంటుందని చెబుతారు.
బుట్టా రేణుకకు.. స్కూళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, కార్ డీలర్ షిప్లు ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయి. జగన్ అలా ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ.. బుట్టా రేణుక నిజంగానే దివాలా స్థితికి చేరినట్లుగా పత్రికా ప్రకటన వచ్చేసింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి వందల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారు. ఈ కారణంగా ఆమె ఆస్తుల్ని వేలం వేయడానికి ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ ప్రకటన జారీ చేసింది.
వైసీపీ నేత బుట్టా రేణుక భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మరికొన్ని ఇతర సంస్థల ఆస్తులను మే 6న ఈ-వేలం వేయనున్నట్టు హైదరాబాద్లోని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకటన విడుదల చేసింది. వ్యాపార అవసరాల నిమిత్తం కొన్నేళ్ల క్రితం వీరు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి రూ.340 కోట్ల రుణం తీసుకున్నారు. తర్వాత కట్టలేదు. రుణ బకాయిలు పేరుకుపోవడంతో తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నిర్ణయించింది.
బుట్టా రేణుక కావాలనే డబ్బులు ఎగ్గొట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఉన్న ఆస్తులతో పోలిస్తే.. అప్పులు తక్కువేనంటున్నారు. అయినా జగన్ చెప్పినట్లుగా.. కోట్లీశ్వరరాలు నుంచి అంతంతమాత్రం ఆర్థిక స్థితికి బుట్టా రేణుక దిగజారిపోయినా ఆశ్చర్యం లేదని… ఆ టంగ్ పవర్ అలాంటిదన్న సెటైర్లు వైసీపీలో వినిపిస్తున్నాయి.