అధికార పార్టీపై విమర్శలు చేయడం విపక్షానికున్న హక్కు లాంటిదే. అందులో అనుమానం లేదు. అయితే సమయం సందర్భం లేకుండా అదే పనిగా విమర్శలు చేస్తే, ఆరోపణలు గుప్పిస్తే ప్రజల దృష్టిలో పలుచన అవుతారు. మంగళవారం నాడు వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసింది అలాగే ఉంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు. మహిళల ఔన్నత్యం, ప్రపంచంలో, దేశంలో, ఏపీలో విజయాలు సాధించిన మహిళలకు జేజేలు పలకడం, మహిళల సమస్యల పరిష్కారానికి ఇంకా ఏయే చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అంశాలపై మాట్లాడితే హుందాగా ఉండేది. జగన్ మాత్రం ప్రభుత్వాన్ని తిట్టడానికే మాట్లాడుతున్నట్టుగా వ్యవహరించారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు నేరాలు, ఘటనలను ప్రస్తావించారు. దీంతో చర్చ కాస్త రచ్చగా మారింది. జగన్ వ్యాఖ్యలకు టీడీపీ సభ్యులు సహజంగానే అభ్యంతరం చెప్పారు. నిజానికి, ఈ ఘటనలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇంకా చాలా సమయం ఉంది. అసెంబ్లీ ఈరోజుతో అయిపోలేదని గుర్తించాల్సింది.
ఇదే సందర్భంగా పార్లమెంటులో కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా మహిళా సభ్యులు చాలా మంది మాట్లాడారు. వారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఉన్నారు. జగన్ కు టీడీపీతో ఉన్న రాజకీయ వైరం కంటే, సోనియాకు బీజేపీతో ఉన్న రాజకీయ వైరమే సుదీర్ఘమైంది. ఎందుకంటే, జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఏడేళ్లు మాత్రమే అవుతోంది. సోనియా అంత కంటే ఎక్కువ కాలం నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. అయినా, పార్లమెంటులో చర్చ సందర్భంగా హుందాతనాన్ని విస్మరించి ప్రసంగించలేదు. మహిళల ఔన్నత్యాన్ని కీర్తించారు. మహిళల సంక్షేమంపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని సూచించారు. మొత్తం మీద, జగన్ ప్రసంగాన్ని, సోనియా ప్రసంగాన్ని పోల్చి చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. సోనియా, జగన్ ఒకే స్థాయి వారని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. సోనియా కేంద్ర స్థాయిలో, జగన్ ఏపీ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు. కానీ వారి ప్రవర్తన తీరులో చాలా తేడా ఉంది.
చీటికీ మాటికీ ప్రభుత్వాన్ని తిట్టినంత మాత్రాన ముఖ్యమంత్రి పదవి రాదు. అందుకు చాలా కష్టపడాలి. ఆయనే సరైన నాయకుడని ప్రజలు నమ్మేలా ప్రవర్తించాలి. రాష్ట్రం బాగు పడుతుంటే సంతోషించాలి. ఏదైనా విషయంలో రాష్ట్రానికి మంచి ర్యాంకు వస్తే ప్రజలందరూ ఆనందిస్తారు. ఆ ఆనందంలో పాలుపంచుకోవాలి. ప్రతిదానీకీ పెడర్థాలు తీస్తే ప్రజా బలానికి బదులు వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుంది. మహిళా దినోత్సవం ప్రసంగంలో కూడా స్త్రీ శక్తి గురించి నాలుగు మంచి మాటలు చెప్పి కూర్చోకుండా రాద్ధాంతానికి దారితీయడం ఏ విధంగా సరైన చర్యో ఆలోచించాలి. వైసీపీ వ్యూహకర్తలు ఈ విషయాలను పట్టించుకోవడం లేదో, లేక వాళ్ల మాటలను కూడా యువనేత లెక్క చేయడం లేదో, అంతా అగమ్య గోచరంగా ఉంది.