వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఆయన బెయిల్ రద్దు చేసి తీరాల్సిందేనని సీబీఐ కోర్టులో గట్టిగా వాదించింది. తాను పిటిషన్ వేయకపోయినా దస్తగిరి వేసిన పిటిషన్ ను పూర్తి స్థాయిలో సమర్థించింది. అంతే కాదు సాక్షులను బెదింరించడానికి ఆధారాలు ఉన్నాయని కూడా స్పష్టం చేసింది. ఏ నేరంలో అయినా బెయిల్ ఇచ్చేటప్పుడు మొదటి షరతు సాక్షులను ప్రభావితం చేయకూడదనే. అవినాష్ రెడ్డి అదే చేశాడని సీబీఐ వాదించడంతో ఆయన బెయిల్ రద్దు చేయకుండా ఉండటానికి కారణాలేమీ కనిపించని పరిస్థితి ఉందని న్యాయనిపుణులు అంచనా వస్తున్నారు.
గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు .. నిందితులు అందర్నీ అరెస్టు చేసినా ఒక్క అవినాష్ రెడ్డికి మాత్రమే మినహాయింపు ఇవ్వడంపై వస్తున్న విమర్శలు .. సీబీఐని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో కోర్టులో సీబీఐ వాదన అవినాష్ రెడ్డికి దిగ్భ్రాంతి కలిగించి ఉండవచ్చు. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారుల్ని టార్చర్ పెట్టి .. వారిపై కేసులు పెట్టిన ఘనత ఉన్న వైఎస్ బ్రదర్స్ కు సీబీఐ ఇక ఏ మాత్రం సానుకూలంగా ఉండే అవకాశం లేదని అనుకోవచ్చు.
ఎన్ని ఆరోపణలు ఉన్నా… వైఎస్ అవినాష్ రెడ్డికే కడప టిక్కెట్ ను జగన్ ప్రకటించారు. నామినేషన్ల గడువు ఈ నెల 18నుంచి ప్రారంభమవుతుంది. అవినాష్ బెయిల్ రద్దుపై తదుపరి విచారణ 15వ తేదీన జరుగుతుంది. ఆయన బెయిల్ రద్దు చేస్తే.. నామినేషన్ల కంటే ముందే జైలుకెళ్లాల్సి ఉంటుంది. ఆయనను పక్కన పెట్టుకుని వివేకా హత్య ఎవరు చేశారో.. జనానికి దేవుడికి తెలుసుంటూ.. నంగి నంగి కబుర్లు చెప్పిన జగన్‌కు అప్పుడు మా తమ్ముడ్ని అరెస్టు చేశారంటూ సానుభూతి రాజకీయం చేసుకునే అవకాశం వస్తుంది.