కంటెయినర్ నిండా డ్రగ్స్… అది కూడా అత్యంత ఖరీదైన కొకైన్ లాంటి వాటితో ఇండియాకు వచ్చింది. విశాఖ పోర్టులో పట్టేసుకున్నారు. ఇంటర్ పోల్ సాయంతో పట్టేసుకున్నామని సీబీఐ ఘనంగా ప్రకటించింది . కానీ ఇది జరిగి రెండు వారాలు దాటిపోయింది. పట్టుకున్నామన్న సమాచారం తప్ప.. ఎవరు రప్పించారు.. ఎందుకు దిగుమతి చేశారు.. వాటితో ఏం చేస్తారు .. అసలు ఈ అంతర్జాతీయ మాఫియాలో లింకులున్న తెలుగువారెవరు అన్న దానిపై తదుపరి సమాచారమే లేదు.
డ్రగ్స్ కంటెయినర్ కు.. కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే ఈ కేసులో ఒక్క అరెస్టు కూడా జరగలేదు. సంధ్యా అక్వా పరిశ్రమ ప్రతినిధులు.. సీబీఐ విచారణ జరుగుతుదంని తెలియగానే తమ సంస్థలో ఉన్న డాక్యుమెంట్లన్నింటినీ బస్సులో వేసి ఓ చోట ఉంచారు. ఆ బస్సును సీబీఐకి అప్పగించకుండా సంధ్యా అక్వా వాళ్లకే ఏపీ పోలీసులు అప్పగించారు.
ఈ కేసులో రాజకీయ దుమారం రేగింది. డ్రగ్స్ తెచ్చింది మీరంటే మీరని రాజకీయ విమర్శలు చేసుకున్నారు. వైసీపీలో ఉన్నా.. ఓ కులం వారు కాబట్టి… డ్రగ్స్ తెచ్చింది బీజేపీ, టీడీపీనేనని వాదిస్తున్నారు. అయితే ఈ కేసులో చిక్కుముళ్లు విప్పాల్సింది సీబీఐనే.ఎందుకంటే… అది చిన్నా చితకా డ్రగ్స్ కాదు. యాభై వేల కోట్ల విలువైన డ్రగ్స్. సూత్రధారుల్ని తేల్చకపోతే.. అది దేశాన్ని డ్రగ్స్ బానిసలుగా చేసేస్తుంది.