కడప ఎంపీగా బరిలోకి దిగుతున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పష్టమైన కార్యాచరణతో ప్రచారం ప్రారంభించారు. బస్సు యాత్ర ప్రారంభించిన ఆమె.. కడప ఓటర్లకు సూటిగా చెప్పాలనుకున్నది చెబుతున్నారు. ఎన్నికల బరిలో ఉన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన హంతకుడు అని.. న్యాయం వైపు నిలబడాలని షర్మిల కోరుతున్నారు. షర్మిల ప్రశ్న.. ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై చర్చ జరిగితే.. వైఎస్ అవినాష్ రెడ్డికి గడ్డు పరిస్థితి ఎదురు కానుంది.
హంతకులు చట్టసభల్లోకి వెళ్లకూడదని.. కానీ హంతకులకు టిక్కెట్ ఇచ్చిన జగనన్న దుర్మార్గం చేస్తున్నాడన్నారు. ఇద్దర్నీ ఓడించాలని షర్మిల పిలుపునిస్తున్నారు. షర్మిలకు జిల్లా వ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి. ఆమెపై సానుభూతి ఉంది. కానీ అధికారంలో ఉన్న పార్టీ.. జగన్ భయం కారణంగా చాలా మంది తెర ముందుకు రావడం లేదు. తల్లి విజయలక్ష్మి మద్దతు కూడా షర్మిలకే ఉందని బంధు వర్గానికి ఇప్పటికే క్లారిటీ వచ్చింది. వైఎస్ వివేకా కుమార్తె సునీత కూడా ప్రచారంలో పాల్గొన్నారు. షర్మిలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
కడప ఎంపీ ఎన్నికల ఎజెండాగా వివేకా హత్య కేసును మారిస్తే.. ఓటర్లు కూడా అలాగే చీలిపోయే అవకాశం ఉంది. వివేకా హంతకుడికా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డకా ఓటు అనే ఆలోచన వస్తే.. ఎంత కరుడు గట్టిన వైసీపీ ఫ్యాన్ అయినా.. అవినాష్ రెడ్డికి ఓటు వేయలేరు. అందుకే షర్మిల ఈ లాజిక్ తో ఎన్నికల్లో దూకుడుగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది.