తెలంగాణ భవన్ కు వాస్తు మార్పులు చేస్తున్నారు. ప్రధాన రహదారిలో ఉన్న గేటును మూసి వేసి.. టెంపుల్ వైపు ఉన్న గేటునే రాకపోకలకు వాడాలనుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ గొప్ప విజయాలు సాధించినప్పుడు కూడా ఇవే పద్దతుులు ఉన్నాయని.. ఓడినప్పుడే లోపాలు చూసుకోవడం ఎందుకన్న సెటైర్లు సహజంగానే వస్తాయి. చేయాల్సింది పార్టీఆఫీసుకు వాస్తు మార్పులు కాదని.. చేసిన తప్పులు దిద్దుకోవడం అన్న కామెంట్లు కూడా గట్టిగానే బీఆర్ఎస్ లో వినిపిస్తున్నాయి. అందులో మొదటిది పార్టీ పేరు మార్చడం .
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశానికి అగ్గి పెట్టాలనుకుని కేసీఆర్ పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అయితే తాను దేశంలో పెట్టాలనుకున్న అగ్గి కాస్తా ముందుగా తన పార్టీకే అంటుకుంది. దహనమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అర్జంట్‌గా తమకు తాము పెట్టుకున్న అగ్గిని ఆపుకోవాలని.. పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలన్న వాదనను మిగిలిపోయిన పార్టీ నేతలు గట్టిగా వినిపిస్తున్నారు
మొదట ఈ వాదన కడియం శ్రీహరి తీసుకు వచ్చారు. మూడు నెలలు తిరిగే సరికి ఆయన గుడ్ బై చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ప్రతి ఒక్క నేత అదే డిమాండ్ తో ఉన్నారు. కేసీఆర్ కూడా అదే ఆలోచనతో ఉన్నారు కానీ.. పార్లమెంట్ ఎన్నికల వరకూ ఆగుదామని చూస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే అగ్గిపెట్టేసుకుని కాల్చేసుకుని ఇప్పుడు మళ్లీ ఆర్పుకుంటే ఏం ప్రయోజనం అన్న వాదన కూడా ఉంది. అయినా మూలాలను వెదుక్కుంటే తప్పు లేదని.. బయటపడవచ్చన్న ఆశాభావం ఎక్కువ మంది నేతల్లో కనిపిస్తోంది.