తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. రెండు, మూడు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ ఇస్తానన్నారు. బీఆర్ఎస్ పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా నిందితులు చెబుతుండటంతో అన్ని వేళ్ళు కేసీఆర్ వైపే చూపుతున్నాయి. తదుపరి ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారనే ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ అన్ని విషయాలను బయటపెడతానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కల్వకుంట్ల ఫ్యామిలీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేసీఆర్ ఏం చెబుతున్నారని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వాన్ని కూల్చాలని కాంగ్రెస్ అప్పట్లో కుట్రలు చేసిందని గతంలోనే ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ప్రభుత్వ కూల్చివేతలపై జాగ్రత్త వహించేందుకే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్తారా..? అనేది సస్పెన్స్ గా మారింది. పైగా కేసీఆర్ రివర్స్ ఎటాక్ చేస్తారన్న వాదనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ పట్ల బీఆర్ఎస్ పెద్దలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పై 2001 నుంచి ( టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి) విచారణ చేపట్టాలని డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తద్వారా ఈ విషయంలో కాంగ్రెస్ ను కట్టడి చేయవచ్చుననేది కేసీఆర్ వ్యూహమంటున్నారు. కానీ, ఈ ఇష్యులో కేసీఆర్ ఎంత ఎదురుదాడి చేసినా… ఆయనకు వ్యతిరేకంగా నిందితుల స్టేట్ మెంట్లు ఉన్నాయి. కాబట్టి.. ఎం చేసినా ఆయన విచారణ ఎదుర్కోక తప్పదని అంటున్నారు.