ఓడిన చోటే గెలవాలంటే ఏం చేయాలో నారా లోకేష్ మంగళగిరిలో అదే చేశారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతం కాదు. తన సామాజికర్గం ఎక్కువ లేదు. పార్టీ గెలిచి చాలా కాలం అయింది. ఎంతో కష్టమని నివేదికలు వచ్చినా నారా లోకేష్ మంగళగిరిని ఎంచుకుని బరిలోకి దిగారు. తొలి ప్రయత్నం ఫలించలేదు. స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. కానీ ఆయన మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలి పెట్టలేదు. ఓడించారు కదా అని.. లైట్ తీసుకోలేదు. తర్వాత ఎన్నికల్లో గెలవడానికి అదే రోజు నుంచి వర్క్ ప్రారంభించారు.
మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యే ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నా పిలిస్తే తాను పలికారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని పలకరించాలంటే అతిశయోక్తి కాదు. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా లోకేష్ తరపున శుభాకాంక్షలు వెళతాయి. విషాదం జరిగినా భరోసా వెళ్తుంది. తాను పోటీ చేసినప్పుడు… ప్రజల్లో తనపై ఎలాంటి భయాలు పెట్టారో.. వాటన్నింటినీ చేతలతో తొలగించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్ని మభ్య పెట్టగలిగిన ఎమ్మెల్యే ఆర్కే అధికారంలోకి వచ్చాక పూర్తిగా తేలిపోయారు. చిన్న పనులు కూడా చేయించలేకపోయారు. పరిస్థితి దిగజారిపోతోందని తెలిసిన తర్వాత మెల్లగా .. తనకేం సంబంధం లేదన్నట్లుగా ఉండటం ప్రారంభించారు. ఓడిపోతారని క్లారిటీ వచ్చాక బీసీలకు ఇస్తామని చెప్పి.. టీడీపీ నుంచే గంజి చిరంజీవిని తీసుకున్నారు. ఆయనను ఆర్థికంగా పీల్చి పిప్పి చేశాక పక్కన పెట్టేశారు. మాజీ ఎమ్మెల్యేలు, వియ్యంకులు అయిన మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమలపై దృష్టి పెట్టారు. కమల కుమార్తె..హనుమంతరావు కోడలకు చివరి క్షణంలో టిక్కెట్ ఇచ్చారు.
మంగళగిరి నియోజకవర్గంలో నారాలోకేష్ చేనేతలకు చేసిన పనులు ఆయావర్గాల్లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. వివిధ వర్గాల ఉపాధికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ కలసి రానున్నాయి. అదే సమయంలో వైసీపీ నేతలు చేసిన దందాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణం అయ్యాయి. మురుగుడు లావణ్య గెలుపు బాధ్యతను ఆర్కే తీసుకున్నారు కానీ.. ఆయన కూడా మనస్ఫూర్తిగా పని చేయడం లేదు. ఓటర్లకు వైసీపీపై కోపం వచ్చేలా చేస్తున్నారు. ఆయన తీరుతో నష్టం ఎక్కువ జరుగుతోందని లావణ్య వర్గీయులు గగ్గోలు పెడుతున్నారు.
ఎన్నికల మేనెజ మెంట్, పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్ మెంట్.. ఇలాంటి విషయాల్లో నారా లోకేష్ ప్రత్యేకమైన కసరత్తు చేశారు. అందుకే ఆయన యాభై వేల మెజార్టీపై నమ్మకం పెట్టుకున్నారు. వైసీపీ ఇప్పటికే చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. లోకేష్ అంచనాల్లో తప్పేమీ లేదన్న భావన అక్కడి రాజకీయ పరిస్థితుల్ని ప్రత్యక్షంగా చూసిన వారికి అర్థమవుతుంది.