జ్వరం బారిన పడటంతో తాత్కలికంగా ప్రచారాన్ని నిలిపి వేసిన పవన్ కల్యాణ్ మళ్లీ ఆదివారం నుంచి వారాహిని ప్రారంభించబోతున్నారు. అనకాపల్లిలో 7న సభ నిర్వహించనున్నారు. 8న ఎలమంచిలి, 9న పిఠాపురంలో సభ నిర్వహించనున్నారు. ఆ తరువాత జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నెల్లిమర్ల, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
పిఠాపురం తర్వాత ఆయన తెనాలిలో ప్రచారం చేయాల్సి ఉంది. ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత తెనాలి సభలో ప్రసంగించే అవకాసం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాష్ట్రమంతా పర్యటించి అన్ని పార్టీల అభ్యర్థులకూ ప్రచారం చేయనున్నారు. మరో వైపు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్లమెంటు స్థాయి ఉమ్మడి సమన్వయ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ స్థాయిలో ఉమ్మడి సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించి కూటమి కార్యాచరణను రూపొందించుకోనున్నారు. ఎన్నికలు సన్నద్ధత, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, కొత్త ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో నివసించే ఓటర్లు, పోస్టల్ ఓట్లు, బూత్ ఏజెంట్ లు తదితర అంశాలపై ఓ అవగాహనకు రానున్నారు. ఎక్కడా సమన్వయ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.