జనవరి 31న తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన విద్వంసంతో తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి సంబంధం ఉందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సి.ఐ.డి. పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆరోజు తునిలో సభ జరిగే ముందు ఆయన చాలాసార్లు ముద్రగడ పద్మనాభంతో ఫోన్ లో మాట్లాడినట్లు సి.ఐ.డి. పోలీసులు తమ దర్యాప్తులో కనుగొన్నారు. అంతకంటే ముందు ఒకసారి ఆయన స్వయంగా వచ్చి ముద్రగడని కలిసినట్లు పోలీసులు కనుగొన్నారు.
చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఉండే కరుణాకర్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో కిర్లంపూడిలో ఉంటున్న కాపు నేత ముద్రగడని ఎందుకు కలుసుకొన్నారు? ఆ సమయంలో ఆయనకు ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసారు? వారివురు ఫోన్లో దేని గురించి మాట్లాడుకొన్నారు? వంటి ప్రశ్నలకు జవాబులు రాబట్టేందుకు కరుణాకర్ రెడ్డిని తమ ముందు హాజరుకమ్మని కోరుతూ సి.ఐ.డి. పోలీసులు త్వరలో ఆయనకు నోటీసు పంపబోతున్నట్లు తెలుస్తోంది.
తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ని ఆందోళనకారులు అడ్డుకొన్నపుడు, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకి రుమాళ్ళు కట్టుకొని పెట్రోల్ క్యానులు పట్టుకొని పరుగులు తీస్తుండటం, ఆ తరువాత క్షణాలలో రైలంతా మంటలు వ్యాపించడం కొందరి మొబైల్ ఫోన్లలో రికార్డు చేసారు. ఆ క్లిప్పింగ్స్ ని స్వాధీనం చేసుకొన్న పోలీసులు, వేరే ప్రాంతాలనుండి వచ్చిన కిరాయి దుండగులే ఈ పనికి పూనుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. సాధారణ ప్రజలయితే అంత చురుకుగా అంత విద్వంసం సృష్టించలేరని పోలీసులు భావిస్తున్నారు. కనుక బయట నుండి వచ్చిన వ్యక్తులే ఎవరో ఈ పనికి పాల్పడి ఉంటారనే అనుమానంతో ఫోన్ కాల్ డాటాని పరిశీలించగా అందులో కరుణాకర్ రెడ్డి పేరు కూడా కనబడింది. కనుక ఈ విద్వంసంతో ఆయనకి కూడా ఏమయినా సంబంధం ఉండవచ్చుననే అనుమానంతో ఆయనకి నోటీసు జారీ చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఒకవేళ వారి అనుమానం నిజమయినట్లయితే, ముద్రగడ పద్మనాభానికి, వైకాపా నేతలకు సమస్యలు తప్పకపోవచ్చును.