అధికారం కోల్పోయి, ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతారో అన్న టెన్షన్ లో ఉన్న కేసీఆర్ కు భారీ షాక్ తగలబోతుందా? ఇప్పటికే పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలకు తోడు మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారా…?
నేను గేట్లు తెరిస్తే మీరు, మీ కుటుంబ సభ్యులు మినహా ఎవరూ మిగలరు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు హెచ్చరించారు. అందుకు తగ్గట్లుగానే అడుగులు పడుతున్నట్లు కనపడుతోంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి వచ్చారు. వారంతా పార్టీ మారే ఉద్దేశంతోనే కలిశారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం కూలుతుందని ప్రతిపక్షాల నుండి పదే పదే విమర్శలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేరికల స్పీడ్ పెంచింది. త్వరలోనే ప్రతిపక్ష హోదా కూడా పోతుందని మంత్రులు ఘాటుగా విమర్శించగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లోనే ఎంత మంది పార్టీ మారబోతున్నారో ప్రకటించటం సంచలనంగా మారింది.
మీ పార్టీ లో ఎవరూ మిగలరు… త్వరలోనే మీ పార్టీ నుండి 20-25మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రకటించారు. 104మంది ఎమ్మెల్యేలున్న మీ పార్టీని జనం బొందపెడితే 39కి వచ్చారని… ఆ 39 మంది ఎమ్మెల్యేల్లో కూడా 20-25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. దీంతో పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ ఊపందుకుంది.
ఖమ్మం నుండి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరగా, మెదక్ జిల్లా నుండి పలువురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు. గ్రేటర్ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.