గద్దర్…. తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. ఎన్నికల ముందు గద్దర్ మరణం, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గద్దర్ తో వ్యవహరించిన తీరు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తీవ్ర ప్రభావం చూపాయి. కాంగ్రెస్ పార్టీ కూడా గద్దర్ కుటుంబానికి కంటోన్మెంట్ టికెట్ ఇచ్చింది.
కంటోన్మెంట్ నుండి గద్దర్ కూతురు వెన్నెల కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయింది. అయినా వెన్నెల రాజకీయంగా యాక్టివ్ గానే ఉన్నారు. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ నుండి గెలిచిన సాయన్న కూతురు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఉప ఎన్నిక వచ్చింది.
అయితే, ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ ఉంటుందో ఉండదో అన్న చర్చ జరిగినప్పటికీ… గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోతే పార్టీని పోటీకి పెట్టారు కాబట్టి, తాము కూడా పోటీ చేస్తామని పార్టీ అనధికారికంగా ప్రకటించింది. దీంతో గద్దర్ కూతురు మరోసారి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఇంతలో కంటోన్మెంట్ లో బీజేపీ నుండి పోటీ చేసిన శ్రీ గణేష్ ను కాంగ్రెస్ లోకి తీసుకున్నారు. తాజాగా శ్రీ గణేష్ కే టికెట్ కూడా అనౌన్స్ చేయటం చర్చనీయాంశంగా మారింది.
గద్దర్ కుటుంబానికి మరోసారి టికెట్ ఇచ్చి గెలిపించుకోవాల్సింది పోయి… బీజేపీ నుండి అభ్యర్థిని తెచ్చుకోవటం ఏంటని, వెన్నెల గెలిచే క్యాండిడేట్ కాకపోతే అద్దంకి దయాకర్ వంటి సమర్థులున్నా ఎందుకు పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న చర్చ కాంగ్రెస్ లో అంతర్గతంగా సాగుతుండగా, బీఆర్ఎస్ వాయిస్ పెంచింది.
గద్దర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి ఎన్నికల్లో లబ్ధి పొందటానికే వాడుకున్నారని… సెంటిమెంట్ ను చూపించి ఓట్లు దండుకొని, ఇప్పుడు ఆ కుటుంబాన్ని మోసం చేశారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీవి అవకాశవాద రాజకీయాలని మరోసారి నిరూపితం అయిందని మండిపడుతోంది.