సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. బస్సుయాత్ర చేస్తున్నారు . బస్సు యాత్రలో వచ్చినంత దూరం వచ్చి.. ఓ బహిరంగసభలో ప్రసంగిస్తున్నారు ఆ బహిరంగసభలో చీకటి పడుతుందని అనిపించిన మరుక్షణం ప్రసంగం ఆపేసి.. అందరికీ నమస్కారం పెట్టేసి.. చీకటి పడుతోంది.. జాగ్రత్తగా ఇంటికెళ్లండి అని చెప్పి వెళ్లిపోతున్నారు. ప్రతి సభలో ఇదే జరుగుతోంది. ఈ చీకటి ఫోబియా ఏమిటన్నది వైసీపీ నేతలకూ అర్థం కాని విషయం.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రాత్రి పది గంటల వరకూ ప్రచారం నిర్వహించుకోవచ్చు. కానీ జగన్ ఏడు గంటల కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ దుకాణం సర్దేసుకుని ఏసీ టెంట్ లోకి వెళ్లిపోతున్నారు. ఆయన సభలు పెట్టినప్పుడు.. ర్యాంప్ వాక్ చేయడానికి ఏర్పాట్లు చేశారు కానీ ఆయన చేయడం లేదు. చీకటే కారణంగా చెబుతున్నారు. చీకటిగా ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ వాళ్లు ఏదో చెబుతున్నారని అందుకే చేయలేకపోతున్నానని అంటున్నారు.
జగన్కు భయం పట్టుకుందన్న భావన ఆ పార్టీ నేతల్లోనూ కనిపిస్తోంది. జగన్ పర్యటనలకు వస్తే చెట్లు కొట్టేయడం దగ్గర్నుంచి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చీకటి పడితే బహిరంగంగా కనిపించేందుకు భయపడుతున్నారు. ఎంపిక చేసిన వాళ్లు దగ్గరకు వస్తారు తప్ప… కొత్త వాళ్లు కనీసం కిలోమీటర్ దూరంలో ఉండాల్సిందే. ఇంతగా ఎందుకు భయపడుతున్నారన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. తన భద్రత.. తన కుటుంబ భద్రత కోసం ఎటా మూడు వందల కోట్ల వరకు బడ్జెట్ అయ్యే ప్రత్యేకమైన విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
అధికారంలో ఉన్నప్పుడే ఇలా ఉన్నా… అధికారం పోయిన తర్వాత ఆయన భయం భయంగా బయటకు కూడా రారేమోనని వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. అంత భయం పట్టుకునేలా ఎందుకు పాలన చేయాలన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.