ఐపీఎల్లో తిరుగులేని జట్టుగా పేరొందిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో కష్టాల్లో మునిగిపోయింది. 3 మ్యాచ్‌లు ఆడితే… మూడింట్లోనూ ఓడిపోయింది. పైగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు చెలరేగుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ.. ఇలా అన్ని రంగాల్లోనూ విఫలం అవుతున్నాడు. ముంబై సమిష్టిగా రాణించడం లేదు. ముఖ్యంగా టాప్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గాయం కారణంగా గత కొన్ని నెలలుగా క్రికెట్‌కి దూరమైన సూర్య కుమార్ యాదవ్ ఎట్టకేలకు ముంబై జట్టుతో కలిశాడు. ఈరోజు ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ ఆడబోతున్నాడు. తనే ముంబైని ఈ క్లిష్టపరిస్థితుల నుంచి రక్షిస్తాడని ముంబై అభిమానులు ఆశిస్తున్నారు. సుమన్ ధీర్ స్థానంలో సూర్య ఈరోజు బ్యాటింగ్ చేయబోతున్నాడని ముంబై యాజమాన్యం ప్రకటించింది. గాయం నుంచి కోలుకొన్న సూర్య ఎలా ఆడతాడో అని ముంబై జట్టు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరోవైపు ఢిల్లీ పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. 4 మ్యాచ్‌లు ఆడితే మూడింట్లో ఓడిపోయింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన పంత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడం మినహా ఢిల్లీ జట్టులో చెప్పుకోదగిన విశేషం ఏం కనిపించడం లేదు. ప్లే ఆఫ్ దారులు మూసుకోకుండా ఉండాలంటే రెండు జట్లకూ ఈ మ్యాచ్ చాలా కీలకం.
హార్దిక్ తప్పేముంది?
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సొంత అభిమానుల నుంచే మద్దతు కరవు అవ్వడం టాక్ ఆఫ్ ఐపీఎల్‌గా మారింది. మైదానంలో హార్దిక్ కనిపించినప్పుడల్లా అతన్ని గేలి చేస్తున్నారు. `మా కెప్టెన్ రోహిత్ శర్మనే` అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. బహుశా.. ఏ కెప్టెన్‌కీ ఇలాంటి నిరసన వ్యక్తం కాలేదేమో? ఈనేపథ్యంలో హార్దిక్‌ని వెనకేసుకొచ్చాడు క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ. కెప్టెన్సీ మార్పు అనేది మేనేజ్మెంట్ తీసుకొనే నిర్ణయమని, అందులో హార్దిక్ తప్పేముందని, ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు తనకు అండగా నిలవాలని హితవు పలికాడు సౌరవ్. అయితే కెప్టెన్‌గా రోహిత్‌కు మంచి అనుభవం ఉందని, తను కెప్టెన్ అయి ఉంటే, ముంబై పరిస్థితి వేరేలా ఉండేదని పేర్కొనడం కొస మెరుపు.