ఇళయరాజా – వంశీలది అద్భుతమైన కాంబినేషన్. వీళ్ల సినిమాల్లో పాటలంటే ఇప్పటికీ చెవులు కోసేసుకొంటారు సంగీత ప్రియులు. ఈ కాంబినేషన్లో ‘అన్వేషణ’ అనే సినిమా వచ్చింది. సూపర్ డూపర్ హిట్టయ్యింది. థ్రిల్లర్ చిత్రాల్లో అదో మైల్ స్టోన్. పాటలూ సూపర్ హిట్టే. ఇందులో `ఇలలో..` అనే పాటొకటి వుంది. పల్లవి వరకూ.. కొత్త ట్యూనే. కానీ చరణం వరకూ వచ్చేసరికి `ప్రేమ ఎంత మధురం` పాట గుర్తొస్తుంది. ఈ చరణాన్ని అచ్చు గుద్దినట్టు ‘అన్వేషణ`లో వాడేశారు. ఈ రెండు సినిమాలకూ ఇళయరాజానే సంగీత దర్శకుడు. తాను వాడిన ట్యూన్ అదే భాషలో.. మరో పాటకు వాడడం ఇళయరాజా చరిత్రలోనే లేదు. మరి… ఈ ‘కాపీ’ ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అసలు విషయం ఏమిటంటే..
‘ప్రేమ ఎంత మధురం’ ట్యూన్ లోనే ఓ కన్నడ సినిమా కోసం పాట కంపోజ్ చేశారు ఇళయరాజా. అప్పట్లో వంశీతో ఇళయరాజాకు మంచి చనువు, అభిమానం ఉండేవి. ఇళయరాజా ఏ పాట చేసినా… ముందు వంశీనే వినేవారు. అలా.. కన్నడ చిత్రానికి సంబంధించిన ట్యూన్ వంశీ విన్నారు. ‘ఇది బాగుంది… మన సినిమాలో వాడుకొందాం’ అని వంశీ చెప్పడం, దానికి ఇళయరాజా ఒప్పుకోవడం జరిగిపోయాయి. అయితే… అదే ట్యూన్లో ‘అభినందన’కు ఓ పాట కంపోజ్ చేసిన విషయం ఇళయరాజాకు గుర్తు లేదు. ఆ సంగతి వంశీకీ తెలీదు. అలా… ‘ఇలలో’ పాట పుట్టింది. జాగ్రత్తగా గమనిస్తే `ప్రేమ ఎంత మధురం` పల్లవి ‘ఇలలో’ పల్లవి రెండూ వేర్వేరు ట్యూన్లు. చరణాలు మాత్రం ఒకటే ట్యూన్లో సాగుతాయి. ‘అభినందన’ 1987లో విడుదల అయితే ‘అన్వేషణ’ 1985లో వచ్చింది. నిజానికి ఈ రెండు సినిమాలకూ సంబంధించిన సంగీత పనులు దాదాపు ఒకేసారి జరిగాయి. కానీ ‘అభినందన’ అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా విడుదలైంది. దాంతో… ‘అన్వేషణ’ ట్యూన్ ని ‘అభినందన’ కోసం ఇళయరాజానే మళ్లీ కాపీ కొట్టారని అనుకొంటారంతా.