యువత భవిష్యత్ తో వాలంటీర్ల పేరుతో ఎలా తన రాజకీయం కోసం వాడుకోవాలో.. ఎలా వదిలించుకోవాలో జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. వాళ్ల భవిష్యత్ ఎలా పోయినా పర్వాలేదు.. తాను మాత్రం రాజకీయంగా బాగుండాలి.. లేకపోతే వాళ్లు కూడా సర్వనాశనమైపోవాలన్నట్లుగా ఆయన తెలివి తేటలు.. ఆలోచనలు ఉంటాయి. దానికి సాక్ష్యం వాలంటీర్ల విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులు చేసుకున్న ఒప్పందాలే.
తాను మళ్లీ రాగానే వాలంటీర్ల ఫైల్‌పై తొలి సంతకం పెడతానని జగన్ మోహన్ రెడ్డి ప్రచారసభల్లో చెబుతున్నారు. ఇప్పటికే ఉన్నారు కదా… ఎందుకు సంతకాలు అనే డౌట్ చాలా మంది వచ్చింది. దానికి సమాధానం బయటకు వచ్చేసింది. మే 31తో వాలంటీర్లతో చేసుకున్న గడువు పూర్తయిపోతుంది. వారికి ఆ తర్వాత జీతాలు కూడా రావు. మళ్లీ కొత్త ప్రభుత్వం వస్తేనే ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఉండదు. అంటే వచ్చే ప్రభుత్వానిదే నిర్ణయం. అందుకే తానొస్తా.. సంతకం పెడతా అంటున్నారు. ముందుగానే ఎందుకు సర్వీసును పెంచే నిర్ణయం తీసుకోలేదు అంటే.. అక్కడే ఉంద అసలు ట్విస్ట్. ఈ సారి వాలంటీర్లను మళ్లీ ఫ్రెష్‌గా ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఉన్న వారు ఎవరూ ఉండరు.
జగన్మోహన్ రెడ్డి తెలివి తేటల దెబ్బకు వాలంటీర్లు బలైపోయారు. ఇప్పటికే రాజీనామాలు చేసి వైసీపీకి పని చేయాలంటూ.. అనేక చోట్ల ఒత్తిడి తెస్తున్నారు. కానీ రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో ఓ ఐదు వేల మంది కూడా ఇంకా రాజీనామాలు చేయలేదు. వైసీపీ నేతల ఒత్తిళ్లను మెజారిటీ వాలంటీర్లు పట్టించుకోవడం లేదు. తాను యాభై వేల ఆదాయం వచ్చేలా చేస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఎక్కువ మంది టీడీపీకి అనుకూలంగా మారుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.