ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం కష్టమేనని పలు సర్వేలు తేల్చేస్తుండగా… తాజాగా ప్రముఖ రాజకీయ వ్యుహకర్త ,గత ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ వ్యుహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ సైతం అదే ఉద్ఘాటించారు. మరోసారి జగన్ రెడ్డి అధికారంలోకి రావడం అసాధ్యమేనని స్పష్టం చేశారు. ఇందుకు జగన్ అనుసరించిన విధానాలే కారణమని విశ్లేషించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… వైసీపీ ఓటమి ఖాయమన్నారు.
ఐదేళ్ళలో ఏపీ అభివృద్ధి కోసం జగన్ ఒక్క మంచి పని కూడా చేయలేదని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ఇదే వైసీపీ అధికారం కొల్పోయెందుకు కారణం అవుతుందన్నారు. చత్తీస్ ఘడ్ గత ముఖ్యమంత్రి భూపేష్ భఘెల్ తరహాలోనే జగన్ కూడా ప్రజలకు డబ్బు పంపిణీ చేశారు తప్పితే.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని చెప్పుకొచ్చారు. కేవలం డబ్బులు ఇచ్చేసి.. అభివృద్ధిని పక్కనపెట్టేశారని స్పష్టం చేశారు. మీకు డబ్బులు ఇస్తున్నా.. నాకు ఒట్లేయండి అనే విధంగా జగన్ వ్యవహారశైలి ఉందన్నారు పీకే. పూర్వం రాజుల తరహలోనే ప్రస్తుత జగన్ పాలన ఉందంటూ.. ఇవన్నీ వైసీపీకి ప్రతిబంధకంగా మారుతాయని స్పష్టం చేశారు.
పీకే వ్యాఖ్యలు ఏపీలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. నగదు పంపిణీపై దృష్టి పెట్టారు తప్పితే జగన్.. ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదన్న అసంతృప్తి ఉంది. మూడు రాజధానులు, ఉద్యోగాల కల్పన విషయంలో వైసీపీ విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రాయలసీమలో వైఎస్ వివేకా హత్య కేసు ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్న ఆగ్రహం అక్కడి ప్రజల్లో ఉంది. ఇవ్వన్నీ వైసీపీని ఎన్నికల్లో దెబ్బకొడుతాయని అంచనా వేస్తుండగా… తాజాగా పీకే చేసిన వ్యాఖ్యలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.