‘లైగర్’ తరవాత హిట్టు కొట్టక తప్పని పరిస్థితికి వచ్చాడు విజయ్ దేవరకొండ. పరశురామ్ తో కాంబో సెట్టయ్యే సరికి, విజయ్ సినిమాపై నమ్మకాలు కలిగాయి. పైగా దిల్ రాజు బ్యానర్ ఆయె. తప్పకుండా ఈసారి విజయ్ హిట్టు కొడతాడనిపించింది. అయితే… ‘ఫ్యామిలీస్టార్’ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడమే కాదు, వసూళ్ల పరంగానూ వెనుకంజలో ఉంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ముందే అమ్మేయడంతో నిర్మాతగా దిల్ రాజు కొంత సేఫ్ అయ్యారు. విజయ్ దేవరకొండకు సైతం ఈ సినిమా ద్వారా మంచి పారితోషికమే గిట్టుబాటు అయినట్టు తెలుస్తోంది. ఈసినిమాకి గానూ రూ.25 కోట్ల రెమ్యునరేషన్ అందుకొన్నాడని టాక్. విజయ్ కెరీర్లో.. ఇదే అత్యుత్తమ పారితోషికం.
‘లైగర్’ సినిమాకి సైతం మంచి పారితోషికమే అందుకోవాల్సింది. అయితే అనుకొన్న మొత్తం ఒకటి, చివర్లో ఇచ్చింది మరోటి. శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చిందంతా విజయ్‌కే అన్నారు. అయితే ‘లైగర్’ ఫ్లాప్ అవ్వడంతో, విజయ్ కూడా తన పారితోషికాన్ని గట్టిగా డిమాండ్ చేయలేకపోయాడు. అయితే ‘ఫ్యామిలీస్టార్’ విషయంలో విజయ్‌కి ఆ అసంతృప్తి లేదు. కరోనా సమయంలోనే విజయ్ ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ తీసేసుకొన్నాడు. ప్రీ బిజినెస్‌పై నమ్మకం ఉండడంతో.. విజయ్ అడిగినంత ఇచ్చేశాడు దిల్ రాజు. సినిమా విడుదలకు ముందే.. విజయ్ పేమెంట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. అలా.. సినిమా ఫ్లాప్ అయినా, తన పారితోషికం విషయంలో విజయ్ ఫుల్ ఖుషీలో ఉన్నాడు.