రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మాత. ‘భారతీయుడు 2’ భారం ఉండడంతో `గేమ్ ఛేంజర్`పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయాడు శంకర్. రెండు చిత్రాల్నీ సమాంతరంగా పూర్తి చేయాల్సిరావడంతో `గేమ్ ఛేంజర్` ఆలస్యమైంది. మార్చిలోగా ‘గేమ్ ఛేంజర్’ పూర్తి చేసి, బుచ్చిబాబు సినిమా పనుల్లో పడిపోవాలని చరణ్ భావించాడు. దానికి తగ్గట్టే షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్లేం వర్కవుట్ అవ్వలేదు. `గేమ్ ఛేంజర్`కి సంబంధించి షూటింగ్ ఇంకా బాకీ పడిపోయింది. ఈవారంలో రాజమండ్రిలో ఓ షెడ్యూల్ ఉంది. చరణ్‌తో పాటుగా ప్రధాన తారాగణం అంతా ఈ షూటింగ్ లో పాల్గొననుంది. అక్కడితో షూటింగ్ పూర్తవదు. మళ్లీ విశాఖపట్నంలో మరో షెడ్యూల్ ఉంది. ఈ రెండూ ఈనెలాఖరునాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే తిరిగొచ్చాక హైదరాబాద్ లో పాటల్ని తెరకెక్కించాలి. ఎలా చూసినా జూన్ వరకూ… ‘గేమ్ ఛేంజర్’ పని అయ్యేట్టు కనిపించడం లేదు. ‘గేమ్ ఛేంజర్’ పూర్తయితే తప్ప బుచ్చిబాబు సినిమాని మొదలెట్టలేడు చరణ్. మరోవైపు బుచ్చిబాబు చరణ్ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు పూర్తి చేసేశాడు. ఏ.ఆర్.రెహమాన్‌తో మూడు పాటలు కూడా చేయించుకొన్నాడు. ఇతర ప్రధాన తారాగణం ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.