అబ్ కీ బార్.. చార్ సౌ కీ పార్.. అనే బీజేపీ నినాదం మేకపోతు గాంభీర్యమేనా..? హ్యాట్రిక్ విజయం ఖాయమని చెబుతున్నా.. ఎక్కడో తేడా కొడుతుందని బీజేపీ భావిస్తోందా..? ఇన్నాళ్ళు తిరుగులేని ఆధిక్యాన్ని ఇచ్చిన ఉత్తరాదిన బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా..? ఉత్తరాదిన కోల్పోయే సీట్లను దక్షిణాదితో సర్దుబాటు చేసుకోవాలనే వ్యూహంతోనే సౌత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
మూడోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమాగా చెబుతున్నా వారికీ గెలుపుపై నమ్మకం కుదిరినట్లు కనిపించడం లేదు.2014, 19ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ నేతల మొహాన్ని కూడా చూసేందుకు ఇష్టపడని మోడీ.. 2023లో మాత్రం ప్రాంతీయ పార్టీలతో చేతులు కలపడంపై వెనక ఓటమి భయం దాగి ఉందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. బీహార్ లో నితీష్ కుమార్, ఒడిసాలో నవీన్ పట్నాయక్ తో చేతులు కలపడం రాజకీయ వ్యూహంలో భాగమేననే చర్చ నడుస్తోంది. ఢిల్లీ, పంజాబ్ లో అప్-కాంగ్రెస్ కూటమి, యూపీలో కాంగ్రెస్ -సమాజ్ వాది కూటమి, బీహార్ లో ఆర్జేడీ -కాంగ్రెస్ కూటమి వలన ఈ రాష్ట్రాల్లో బీజేపీకొచ్చే 40సీట్లు ఇండియా కూటమి ఎగరేసుకుపోతుందని బీజేపీ అంచనా వేస్తోంది.
గుజరాత్ , హర్యానా, ఢిల్లీ , ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ లలో 52సీట్లను గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కాని, ప్రస్తుతం బీజేపీకి ఆ సీన్ కనిపించడం లేదు. గుజరాత్ లో అప్ – కాంగ్రెస్ పొత్తు, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, ఢిల్లీలో అప్ వైపు మొగ్గు ఉండటం, హర్యానాలో బీజేపీపై వ్యతిరేకత ఉండటం.. ఇవన్నీ ఇండియా కూటమికి అడ్వాంటేజ్ గా మారనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ 15 స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉందని బీజేపీ ఆందోళనతో ఉన్నట్టు వినికిడి. రాజస్తాన్, మధ్యప్రదేశ్ , చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయోనని కాషాయ దళం కలవరపాటుకు గురి అవుతోంది.
సౌత్ లో 128 లోక్ సభ స్థానాలు ఉండగా.. మెజార్టీ స్థానాల్లో ఇండియా కూటమి సత్తా చాటడం ఖాయం. కేవలం కర్ణాటకలో మాత్రమే బీజేపీ కొంత గణనీయమైన స్థానాలను గెలుచుకుంటుందని.. అదే సమయంలో అక్కడ మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న వాదనలు ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ కొంత ప్రభావం చూపినా కేరళ, తమిళనాడులోనూ ఇండియా కూటమికి ఎలాగూ తిరుగు ఉండదు. సౌత్ లో ఇండియా కూటమిని దెబ్బతీయకపోతే ఇబ్బంది అవుతుందని బీజేపీ లెక్కలు వేసుకుంటుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోన్న సీట్లు 450. ఇందులో 370 సీట్లు గెలుస్తామని మోడీ చెబుతున్నారు. అంటే పోటీ చేసే స్థానాల్లో 82 శాతం సీట్లను గెలవాల్సి ఉంటుంది. 2019లో 70 శాతం సీట్లలో బీజేపీ గెలిచింది. ఆ ఎన్నికల్లో 436 సీట్లలో పోటీ చేసి 303సీట్లను బీజేపీ గెలుచుకుంది.ప్రస్తుత సమీకరణాల నేపథ్యంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు 70 సీట్లు కోల్పోనున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ కేవలం అభివృద్ధి ఎజెండా కాకుండా ఇతర అంశాలను ముందుంచి రాజకీయం చేయడం.. అదే సమయంలో కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టో ఈ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బీజేపీ ఆందోళన చెందుతోంది. పోలింగ్ నాటికి పరిస్థితి ఎటు వైపు దారితీస్తుందోనని బీజేపీలో టెన్షన్ మొదలైనట్లు రాజకీయ వర్గాలంటున్నాయి.