గత ఎన్నికల్లో జనసేన భారీ ఓటమి మూటగట్టుకొంది. సాక్షాత్తూ పవన్ కల్యాణే రెండు చోట్లా ఓడిపోయారు. అయితే జనసేనకు 6 శాతం ఓటు బ్యాంకు ఉంది. అది ఈసారి ఎన్నికల్లో గనణీయంగా పెరగబోతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈసారి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, కూటమిలో భాగస్వామిగా చేరడం, పవన్ రాజకీయ ఆలోచనల్లో పరిణితి రావడం వల్ల – ఈసారి ఫలితాలు జనసేనను ఉత్సాహపరిచేలా ఉంటాయని భావిస్తున్నారు.
చిత్రసీమ నుంచి కూడా జనసేనకు కావల్సినంత సహాయ సహకారాలు లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ అభిమానులు చిత్రసీమలో చాలామంది ఉన్నారు. యువ హీరోలంతా పవన్ వీరాభిమానులే. వాళ్లంతా జనసేనకు సైలెంట్ గా సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది హీరోలు జనసేనకు మంచి మొత్తంలో విరాళాలు పంపుతున్నట్టు సమాచారం. అయితే ఆ వివరాలు బయటకు రావడం లేదు. చిరంజీవి ఈరోజు జనసేన పార్టీకి ఏకంగా రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. పవన్ అభిమానులైన కొంతమంది హీరోలు ఇప్పటికే జనసేనకు విరాళాలు అందజేసేశారని తెలుస్తోంది. అంతేకాదు.. ప్రచార చిత్రాలు రూపొందించడంలోనూ, పొలిటికల్ యాడ్స్ తీర్చిదిద్దడంలోనూ కొంతమంది దర్శక నిర్మాతలు జనసేనకు అండదండగా ఉన్నారని సమాచారం. సాధారణంగా టీడీపీకి ఇలాంటి సపోర్ట్ ఉండేది. సీరియర్ దర్శకులు, నిర్మాతల్లో చాలామంది టీడీపీ అభిమానులే. వాళ్లంతా ప్రతీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ తరపున యాడ్స్ రూపొందించడంలో సహాయ సహకారాలు అందించేవారు. జనసేన ఇప్పుడు టీడీపీతో చేతులు కలిపింది. అందుకే… జనసేనకు సైతం వాళ్లంతా సహాయంగా నిలుస్తున్నారు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో కనిపించడం ఖాయం.