జనసేన పార్టీకి విరాళంగా రూ. ఐదు కోట్లను చిరంజీవి ఇచ్చారు. హనుమంతుని విగ్రహం సాక్షిగా ఈ చెక్ ను పవన్ , నాగబాబులకు అందించారు. విజయీభవ అని దీవించారు. రూపాయిల్లో చూసుకుంటే ఇది ఐదు కోట్ల మొత్తం కావొచ్చు కానీ.. రాజకీయంగా చూసుకుంటే ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్‌కు అంతులేనంత గుండె ధైర్యం వచ్చినట్లే అనుకోవచ్చు.
చిరంజీవి విషయంలో వైసీపీ ఆడిన మైండ్ గేమ్స్ లెక్కలేనన్ని ఉన్నాయి. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వచ్చే ఉద్దేశం లేదని చెప్పినా .. ఆయన మనస్థత్వాన్ని .. బ్లాక్ మెయిల్ చేసేందుకు ఉపయోగించుకున్నారు. చిరంజీవి ఖండించలేరని తెలిసి తమ పార్టీకి ఆయన మద్దతుగా ఉన్నట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికీ అదే తరహా ప్రచారం చేస్తూ.. జన సేన క్యాడర్ లో అయోమయం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటికి చిరంజీవి ఇచ్చిన చెక్.. చెక్ పెట్టిందని అనుకోవచ్చు.
ఇప్పుడు చిరంజీవి తన సోదరుడికి తన సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లుగా సందేశం ప్రజల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా జనసేన , చిరంజీవి ఫ్యాన్స్ కు వెళ్తుంది. ఈ విషయంలో పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అనుకోవచ్చు. రాజకీయ ప్రచారాలకు చిరంజీవి దూరం కాబట్టి కూటమి కోసం ఆయన ప్రచారం చేయరు కాబట్టి దాన్నితమకు అనుకూలంగా మల్చుకోవాలనుకున్న వారికి గట్టి షాక్ తగిలినట్లయింది. జనసేనకు మనోబలం పెరిగినట్లయింది.