ప్రభుత్వ ఉన్నతాధికారులు కొంతమంది బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా..? ప్రభుత్వం తీసుకునే సమాచారాన్ని ముందే లీక్ చేస్తున్నారా..? వివిధ శాఖలో బీఆర్ఎస్ కోవర్టులను గుర్తించి వేటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారా..? అంటే అవుననే అంటున్నాయి సెక్రటేరియట్ వర్గాలు.
కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రధానంగా ఇరిగేషన్ , విద్యుత్ శాఖలోని అధికారులు ప్రభుత్వ నిర్ణయాలను బీఆర్ఎస్ పెద్దలకు చేరవేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో వివిధ విభాగాల్లో వేయి మందికిపైగా రిటైర్డ్ అధికారులను రీఅపాయింట్ చేసుకున్నారు. వారిలో కొంతమంది స్వామి భక్తి చాటుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏయే అంశాలపై చర్చ జరుపుతోంది..? ఎలాంటి నిర్ణయాలను తీసుకుంది..? అనే అంశాలను బీఆర్ఎస్ లీడర్లకు చేర్చుతున్నారని ప్రభుత్వ వర్గాలు సందేహం వ్యక్తం చేసున్నాయి.
గతంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వ సమాచారం ముందే లీక్ అవుతుందని సీరియస్ అయ్యారు. ఇంటలిజెన్స్ అధికారులను అలర్ట్ చేశారు. అయినా.. కొందరు అధికారులు మాత్రం బీఆర్ఎస్ కు సమాచారాన్ని చేరవేయడాన్ని మానడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ అనుమాలకు బలం చేకూర్చేలా కరెంట్ కోతలు కూడా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో అప్రకటిత కరెంట్ కోతలపై సర్కార్ ఆరా తీయగా.. స్థానిక అధికారుల ఆదేశాల మేరకే కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారని గుర్తించారు.ఇదంతా సర్కార్ ను బద్నాం చేసేందుకు కొంతమంది పనిగట్టుకొని చేస్తున్న ప్రయత్నమని సర్కార్ భావిస్తోంది.
ప్రభుత్వ సమాచారం లీక్ అవుతుండటంపై రేవంత్ ఆగ్రహంగా ఉన్నారు. బీఆర్ఎస్ పెద్దలకు టచ్ లో ఎవరెవరు ఉన్నారో గుర్తించి.. వారిపై నజర్ పెట్టాలని సూచించినట్లుగా తెలిసింది. అదే సమయంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తోన్న అధికారులపై చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు టాక్.