ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు చేసిన తప్పిదం పోలీసు వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ కేసులో తాను దొరికిపోతాననే భయంతో ఎస్ఐబీ సమాచారాన్ని అంతా ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. అందులో కొన్ని ఏళ్ళనాటి డేటా ఉండటంతో విలువైన సమాచారం కోల్పోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ డేటాను తిరిగి పొందటం సాధ్యమా..?అని నిపుణులతో సంప్రదింపులు జరుపుతోన్న..కట్టర్ తో హార్డ్ డిస్క్ లను పూర్తిగా ధ్వంసం చేయడంతో డేటా తిరిగి పొందటం అసాధ్యమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే పోలీసు వర్గాలను పరేషాన్ చేస్తోంది.
ప్రణీత్ రావు ధ్వంసం చేసిన డేటాలో ఫోన్ ట్యాపింగ్ ఆధారాలతోపాటు మావోయిస్టులు, ఉగ్రవాదులు, డ్రగ్స్ మాఫియా, నేరగాళ్ల సమాచారం డిలీట్ అయింది. ఇందులో నేరగాళ్ల ఫోటోలు, వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు..? అనే పక్కా సమాచారం ఉండటంతో ప్రభుత్వం ముందే చర్యలు చేపట్టేది. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన 47 హార్డ్ డిస్క్ లలో ఎస్ఐబీ డేటా కొలాప్స్ అయింది. దీంతో ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగితే ఎలా అని పోలీసు వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. డేటాను తిరిగి పొందేందుకు పోలీసులు అనేక విధాలా ప్రయత్నిస్తున్నా.. అవేవి వర్కౌట్ అవ్వడం లేదని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అసాంఘీక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలు , వాటి మ్యాపింగ్ లు , ట్రాకింగ్ లకు సంబంధించిన సమాచారం ధ్వంసం కావడంతో పోలీసులు మధనపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని మాత్రమే కాకుండా శాంతిభద్రతలకు సంబంధించి విలువైన సమాచారం కూడా ధ్వంసమైంది. డేటాను తిరిగి పొందటం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది.
ప్రభాకర్ రావు టీం ఫోన్ ట్యాపింగ్ పరికరలను అందించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్వెర్జన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్స్ ఎక్స్పర్ట్స్ డేటాను రిట్రీవ్ చేసేందుకు సహాయం అందిస్తారా..? అని వారిని కూడా సంప్రదించారు పోలీసులు. ఈ క్రమంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారికి నోటిసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. అయితే..ఎస్ఐబీ డేటా డిలీట్ పై పోలీసు వర్గాలు నోరు విప్పడం లేదు. ఈ విషయమై గోప్యత పాటిస్తున్నారు.