నన్ను పదవి నుంచి తప్పించే కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సాధారణంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి ఆషామాషీగా ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. ఖచితమైన సమాచారం ఉంటేనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. దీంతో రేవంత్ పదవిని పీకేసేందుకు కుట్ర పన్నుతున్న కుట్రదారులు ఎవరనేది ఇప్పుడు బిగ్ డిబేట్ గా మారింది.
గత కొన్నాళ్ళుగా రేవంత్ సర్కార్ పై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ నేతలు ప్రకటిస్తుండగా..త్వరలోనే తెలంగాణలో ఎక్ నాథ్ షిండేలు పుట్టుకొస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి సీటును ఆ పార్టీ నేతలే లాగేస్తారని ఆరోపిస్తుండగా..తాజాగా కొడంగల్ పర్యటనలో సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలు ఈమేరకు కుట్రలు చేస్తున్నాయా..?లేక సొంత పార్టీలోనే రేవంత్ టార్గెట్ గా కుట్ర రాజకీయం నడుస్తోందా..? అనే ప్రశ్నలు తాజాగా తెరపైకి వచ్చాయి.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తే దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు మనుగడ సాగించడం కష్టమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. సౌత్ లో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీకి బీఆర్ఎస్ పరోక్ష సహకారం అందిస్తుందన్న విశ్లేషణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ కారణంగానే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలనే ఉద్దేశ్యంతోనే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చునని అంటున్నారు.