మరో దఫా మంచు విష్ణునే ‘మా’ అధ్యక్షుడిగా నియమితుడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి ఎన్నిక లేదు. ఏక గ్రీవంగానే ఆ పీఠాన్ని విష్ణు అధిరోహిస్తారని టాక్. ఇందుకు సంబంధించి ‘మా’ సభ్యులంతా ఓ నిర్ణయానికి వచ్చేసినట్టే. సభ్యుల అనుమతి ఉంటే, ఏక గ్రీవంగా ‘మా’ అధ్యక్షుడ్ని ఎన్నుకోవొచ్చని ‘మా’ రూల్స్ చెబుతున్నాయి. సో.. ఈసారీ మంచు హీరోకే ‘మా’ పట్టం.
అయితే గత ఎన్నికల్లో ‘మా’ బిల్డింగ్ కట్టిస్తానన్న హామీతో పీఠం ఎక్కాడు విష్ణు. అప్పట్లో ఎన్నికలు వాడీ, వేడిగా సాగాయి. అసెంబ్లీ ఎన్నికల రేంజ్ లో లాబీయింగ్లూ, మీటింగులు, వాగ్దానాలూ… అబ్బో ఆ హడావుడే వేరు. మీడియా కూడా ‘మా’ ఎన్నికల్ని, వాటి చుట్టూ రాజుకొన్న వివాదాల్నీ బాగా ప్రమోట్ చేసింది. ఈలోగా రెండేళ్లు గడిచిపోయాయి. మా బిల్డింగ్ ఊసే లేదు. ‘మా’ కోసం నిధులు సేకరిస్తానని చెప్పిన విష్ణు, ఆ విషయంలో ఎంత పురోగతి సాధించాడో చెప్పలేదు. త్వరలోనే ఓ ఈవెంట్ నిర్వహించి నిధులు రాబట్టి, వాటి ద్వారా ‘మా’ బిల్డింగ్ కట్టాలని విష్ణు భావిస్తున్నాడు. నిధులతో మా భవనం నిర్మించే ఆలోచన ఉంటే, అదేదో ముందే చెయొచ్చు కదా? ఈ రెండేళ్లు ఎందుకు కాలయాపన చేసినట్టు? మా భవనాన్ని సొంత ఖర్చుతో నిర్మిస్తానని విష్ణు ఇచ్చిన మాట ఏమైంది? మూడు చోట్ల స్థలం చూశానని చాలా సార్లు చెప్పిన విష్ణు ఆ స్థలం ఎక్కడ ఉందో ఇప్పటి వరకూ ఎందుకు చెప్పలేదు. అసలు ఈ రెండేళ్లలో, ప్రెసిడెంట్ హోదాలో ఏం చేసినట్టు? ‘మా’ కోసం ఏం సాధించినట్టు? నేను ప్రెసిడెంట్ గా ఉండేది ఈ ఒక్క టర్నే అని చెప్పిన విష్ణు ఆ మాటని ఎందుకు మర్చిపోయాడు? వీటికి విష్ణు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
గత అక్టోబరుతోనే విష్ణు పదవీ కాలం అయిపోయింది. అయితే.. వార్షిక లెక్కలు తేలేవరకూ పాత కమిటీనే ఉంటే మంచిదన్న ఆలోచనతో… పదవీ కాలం పొడిగించారు. ఏప్రిల్ లో ‘మా’ ఎన్నికలు జరగాలి. అయితే ఇప్పటి వరకూ అలాంటి ఊసే లేదు. నిజానికి ‘మా’ అధ్యక్ష పీఠంపై సినిమావాళ్లకు ఇప్పుడు ఆసక్తి తగ్గిపోయింది. పెద్దగా దాని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కనీసం మాట్లాడడం లేదు. `మా` కమిటీ కూడా చాలా స్థబ్దుగా ఉంది. అందుకే మిగిలిన వాళ్లు కూడా ‘మాలో ఏం జరిగితే మాకేంటి’ అని లైట్ తీసుకొంటున్నారు.