ఎంపీ రఘురామకృష్ణరాజు పవన్ కల్యాణ్ ను కలిశారు. పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ కల్యాణ్.. పలువురు ప్రముఖులను కలిశారు. పవన్ తో ప్రత్యేకంగా భేటీ అయిన రఘురామ.. తాను ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని .. ప్రచారానికి రావాలని పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించినట్లుగా చెప్పారు. అయితే పోటీ ఎక్కడో మాత్రం తనకే తెలియదని రఘురామ అంటున్నారు.
రఘురామ పోటీపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఆయనకు నర్సాపురం ఎంపీ సీటు ఇప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ సీట్లు మారిస్తే.. మాకు కూడా కావాలంటూ.. జీవీఎల్ లాంటి వాళ్లు హడావుడి చేస్తున్నారు. వైజాగ్ నుంచి ఎవరికీ తెలియని ఓ పది మందిని ఢిల్లీకి తీసుకెళ్లి బీఎల్ సంతోష్‌కు వినతిపత్రం ఇప్పించారు జీవీఎల్. సీట్ల మార్పుపై కసరత్తు జరుగుతోందని విశాఖను కూడా మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి రాజకీయం పెరుగుతూండటంతో మార్పులపై కసరత్తు స్లో అయిపోయింది.
ఇదంతా కాదు కానీ.. రఘురామకు తన కోటాలో నుంచే అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.ఉండి నియోజకవర్గం ఆయనకు అన్ని విధాలుగా సరైనదని భావిస్తున్నారు. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు జోరుగా ప్రచారం చేస్తున్నారు. రఘురామ కూడా అక్కడి నుంచి పోటీ పై స్పష్టత లేదని చెబుతున్నారు. ఆయనకు ఏ సీటు వస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. రఘురామ మాత్రం తాను ఒంటరిని కాదని తనకు చంద్రబాబు, పవన్ మద్దతుగా ఉన్నారని అంటున్నారు.