ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు నుంచి సేకరించిన సమాచారంతో ఆధారాలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. బీఆర్ఎస్ సుప్రీమో నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించడంతో ఈ విషయంలో మరింత స్పష్టత కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ముందుగా సెలక్ట్ చేసుకున్న నేతల ఫోన్లను ట్యాప్ చేసి అనంతరం ఆ ఆడియో రికార్డులను బీఆర్ఎస్ సుప్రీమోకు కూడా పంపించారా..? వాటిని విన్న తర్వాతే ఏమేం చేయాలో పోలీసులకు అక్కడి నుంచి ఆదేశాలు అందాయా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలు సంచలన విషయాలను వెల్లడించారు రాధాకిషన్ రావు. ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ దర్యాప్తుకు కీలకం అవుతుందని పోలీసులు నమ్ముతున్నారు. బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా రాధాకిషన్ రావు చెప్పడంతో.. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసి వాటిని సుప్రీమోకు పెన్ డ్రైవ్ లలో అందించారా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ రికార్డు సంభాషణలను సుప్రీమోకు ఎవరు చేర్చారు..?ఎప్పుడు పంపించేవారు..? ఇంతకీ ఈ రికార్డులను ఆయన వినేవారా..? విన్నాక ఆయన తదుపరి ఆదేశాలు ఇచ్చేవారా..? ఇలా అనేక అంశాలపై పోలీసులు దృష్టిసారించారు.
ఈ కేసులో ప్రభాకర్ రావు కీలకమని భావిస్తున్నందున ఆయన్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించనున్నారు పోలీసులు.ప్రభాకర్ రావు అరెస్ట్ కు ముందే ఈ విషయాలను తేల్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు ప్రణీత్ రావు ధ్వంసం చేశారని సమాచారం. అయితే.. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన రికార్డులను కేవలం హార్డ్ డిస్క్ లలోనే నిక్షిప్తం చేశారా..? లేక పెన్ డ్రైవ్ లలో కూడా ఉంచారా..?అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆధారాలను పూర్తిగా ధ్వంసం చేయడంతో.. వాటిని రిట్రీవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
హార్డ్ డిస్క్ లు మాత్రమే కాకుండా పెన్ డ్రైవ్ లను కూడా నిందితులు వాడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అవి లభ్యమైనా ఈ కేసు విచారణ వేగంపుంజుకుంటుందని నమ్ముతున్నారు పోలీసులు. వచ్చే వారం ఈ కేసులో మరిన్ని కీలక పరిణామలు ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.