సెట్టింగులు లేవు… పంచాంగ శ్రవణం లేదు.. ప్రత్యేక పూజలు లేవు .. భజన పరులు వింత శబ్దాలతో చేసే పొగడ్తలు లేవు. వేద పండితులు వచ్చి ఆశీర్వదించడంతో ఉగాది వేడుకలు ముగిసిపోయాయి. మామూలుగా అయితే ఓ రేంజ్ నిర్వహిస్తారు. అదీ ఎన్నికల సమయం కాబట్టి ఇంకా హంగామా చేయాలి. గెలిచిపోతున్నామని పండితులతో చెప్పించుకోవాలని కానీ జగన్ రెడ్డి చాలా నీరసంగా ఉగాది జరిపించేశారు. పండితులతో తాము గెలుస్తున్నామని 175కి 175 వస్తాయని చెప్పించుకోలేకపోయారు. అలా చెప్పడానికి ఏ పండితుడూ రాలేదమో కానీ .. పార్టీ శ్రేణుల్లో మాత్రం సెంటిమెంట్ దెబ్బతింటోంది.
జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పేలవంగా సాగుతోంది. పార్టీ నేతలు కూడా జనాల్ని సమీకరించలేకపోతున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లోనే నాలుగు, ఐదు వందల మందితో బస్సుయాత్రకు స్వాగతం చెప్పడానికి తంటాలు పడాల్సి వస్తోంది. ఎందుకీ పరిస్థితి వస్తుందో ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. ఐదేళ్లు పార్టీ క్యాడర్ ను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు వారు ఆసక్తిని కోల్పోయారన్న చర్చ జరుగుతోంది. వారికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా… పెద్దగా స్పందించడం లేదు. రూ. పది వేలు ఇచ్చినా తీసుకుంటున్నారు కానీ.. పార్టీ కార్యక్రమాలకు రావడం లేదు.
మరో వైపు పార్టీ గెలుపు అసాధ్యమన్న అభిప్రాయం క్యాడర్ లోనూ పేరుకుపోయింది. పార్టీ నేతల్లోనూ అదే అభిప్రాయం ఉంది. కొంత మంది గుంభనంగా ఉండి గెలుస్తుందన్నట్లుగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కానీ.. అసలు విషయం మాత్రం వారికీ అర్థమైపోయింది. ఈ ప్రభావం చాలా ఎక్కువగా వైసీపీపై ఉంది. ఏ మాత్రం నమ్మశక్యంగా లేని ప్రచారాలతో.. అప్పులు చేస్తూ.. రాష్ట్రాన్ని దివాలా తీయించిన వైనం ప్రజల్లో బలమైన ప్రభావం చూపిస్తోంది. పథకాల డబ్బులు అకౌంట్లలో జమ కాకపోగా.. సొంత కాంట్రాక్టర్లకు మాత్రం వేల కోట్లు తరలించిన వైనం కూడా ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది.
పోటీలో ఉన్న పలువురు అభ్యర్థులు ఇప్పటికే ఖర్చు విషయంలో చేతులెత్తేశారని చెబుతున్నారు. వారికి హైకమాండ్ డబ్బులు సర్దుతోంది. కొంత మందిని మార్చాలని అనుకుంటోంది. నిజానికి ఇంకా నోటిఫికేషన్ రావడానికి ఎనిమిది రోజులకుపైగా సమయం ఉంది. అప్పుడే వైసీపీలో ఇంత నీరసం కనిపించడంతో… నామినేషన్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని .. ఆ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది