లోక్ సభ ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లు బీజేపీ గెలిస్తే.. తెలంగాణలో అధికారం తమదేనని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు నిజంగా బీజేపీకి మెజార్టీ సీట్లను అందిస్తాయా..? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ప్రజా తీర్పును అపహాస్యం చేసి ప్రభుత్వాలను పడగొట్టి అధికారం చేజిక్కించుకుంటామని బీజేపీ నేతలు ప్రకటించడం ప్రజాస్వామ్యమా..? అనే చర్చ జరుగుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని.. అటు బీఆర్ఎస్ , ఇటు బీజేపీ జోస్యం చెప్తున్నాయి. అధికారం మాదంటే, మాదేనని అంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల బీజేపీపై కొంత అసంతృప్తి ఉంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్పూర్తిని నిలబెట్టలేవని.. ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పాటైన ప్రభుత్వాలను టార్గెట్ చేయడం అనైతికమని మేధావుల స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మేధావి వర్గం బీజేపీ వ్యతిరేక స్వరం అందుకున్నది. మరోసారి కాషాయ పార్టీ అధికారం చేపడితే రాజ్యాంగాన్ని మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదని తమ వాదనలను బలంగా వినిపిస్తున్నారు. తెలంగాణలో కూడా అవే రకమైన వాదనలు వ్యక్తం అవుతుండగా…బీజేపీ మళ్ళీ అదే పాట పాడుతోంది.
లోక్ సభ ఎన్నికల్లో 12సీట్లు గెలిస్తే రాష్ట్రంలో అధికారం మాదేనని ప్రకటనలు చేస్తోంది. ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని కైవసం చేసుకోవడం బీజేపీకి ఓ అలవాటుగా మారింది. దేశంలో ఒకే పార్టీ – ఒకే ప్రభుత్వం ఉండేలా ఆ పార్టీ కుట్రలు చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చేవే. ఇలాంటి వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి గణనీయమైన ఓట్లను తెచ్చిపెడుతాయా..? అంటే సందేహమే. బీజేపీ వ్యతిరేక వర్గాల్లో కొంత ఆలోచన మొదలైన ఈ తరహ వ్యాఖ్యల వలన ఆఓటు బ్యాంక్ ను దూరం చేసుకోవడమే అవుతుంది. ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ఏం బావుకుంటుందో..!?వారికే తెలియాలి.