దేశంలో అత్యంత శక్తివంతమైనవి చట్టసభలే. విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడేది పాలకులే. వారిని ఎన్నుకునేది ఓటరు దేవుళ్ళే. అందుకే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం అని అంటారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. సోమవారంలోగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకుగాను ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఎన్నికల అధికారులు పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఓటు హక్కుపై అవగాహనా సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు మరింత సమయం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇలాగే ఓటరు నమోదును ప్రోత్సహించారు. నవంబర్ 30న పోలింగ్ ఉండగా… అక్టోబర్ 31వరకు ఓటరు నమోదుకు దరఖాస్తులను స్వీకరించారు. పరిశీలన తర్వాత నవంబర్ 11న ఓటరు తుది జాబితాను విడుదల చేశారు.కాగా. లోక్ సభ ఎన్నికల తుది జాబితాను మొదట ఫిబ్రవరి 8న ప్రకటించారు కాని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మరింత సమయం ఇచ్చారు అధికారులు. ఫిబ్రవరి 8 నుంచి ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లతో తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించనున్నారు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. 2006 మార్చి 31లోగా పుట్టిన వారు తమ పేరును ఓటర్ జాబితాలో నమోదు చేసుకునేందుకు ఫాం -6లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఫాంతోపాటు వయస్సు ధృవీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో జతచేసి బూత్ లెవల్ ఆఫీసర్ కు అందించాల్సి ఉంటుంది.
ఓటరు జాబితాలో పేరు గల్లంతైన వారు ఈ ఫాం 6 ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.
మరిన్ని వివరాల కోసం, ఓటరు దరఖాస్తు కోసం https//nvsp.in లేదా https//ceotelangana.nic.in వెబ్ సైట్లను సందర్శించండి