తుమ్మల నాగేశ్వర్ రావు… తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్ మొదలుకొని చంద్రబాబు హయాం వరకు ఖమ్మం రాజకీయాలను కనుసైగలతో శాసించిన వ్యక్తి. జిల్లాలో ఆయనకున్న పట్టును గుర్తించే కేసీఆర్ హయాంలోనూ ఖమ్మం పగ్గాలను అప్పగించారు. తద్వారా కమ్మల ఓటు బ్యాంక్ ను బీఆర్ఎస్ ను వైపు మళ్ళించుకోవచ్చుననేది కేసీఆర్ వ్యూహం. ఈ క్రమంలోనే రెండోసారి అధికారంలోకి వచ్చాక తుమ్మల పట్ల కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది.2023లో కాంగ్రెస్ లో చేరి ఖమ్మం నుంచి పోటీ చేసిన తుమ్మల తన బలాన్ని చాటుకుంటూ చతురతను కనబరుస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ను చెప్పి మరీ చావుదెబ్బ కొట్టి తన ప్రాబల్యాన్ని చాటుకున్న పొంగులేటిల ఆధిపత్యపోరుతో జిల్లాలో తుమ్మల సంకట స్థితిని ఎదుర్కొంటారని అంతా అంచనా వేశారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జిల్లాలో తన ప్రాబల్యాన్ని చాటుకుంటున్నారు తుమ్మల. ఖమ్మం లోక్ సభ టికెట్ పై జిల్లాలో ఈ ముగ్గురు లీడర్ల మధ్య హోరాహోరీ ఫైట్ సాగుతోన్న వేళ తన వ్యూహాలను అమలు చేసి.. తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు తుమ్మల.
ఖమ్మం ఎంపీ టికెట్ ను తన భార్యకు ఇప్పించుకోవాలని భట్టి విక్రమార్క, తన సోదరుడికి ఇవ్వాలని పొంగులేటిలు తమదైన ప్రయత్నాలు చేశారు. తుమ్మల కూడా తన కుమారుడికి ఇవ్వాలని మొదట కోరారు. ఇక్కడే తన ప్లాన్ ను మార్చి చక్రం తిప్పారు. తెలంగాణలో కమ్మ వారికి పెద్దదిక్కుగా ఉన్న తన మిత్రుడు మండవ వెంకటేశ్వర్ రావును ఎంపీ టికెట్ రేసులోకి తీసుకొచ్చారు. మధ్యే మార్గంగా మండవ ఎంపిక ఉంటుందని…ఎంపీ టికెట్ మండవకు ఇచ్చేలా చక్రం తిప్పారు. ఇందుకోసం తన రాజకీయ బలాన్ని మాత్రమే కాకుండా , తనకు సన్నిహితుడైన ఓ మీడియా అధినేత సహకారాన్ని కూడా తుమ్మల వాడుకున్నారని టాక్.
ఏదీ ఏమైనా.. ఖమ్మం టికెట్ విషయంలో భట్టి, పొంగులేటిల ప్రయత్నాలకు చెక్ పెడుతూ… మండవ పేరును రేసులోకి తీసుకొచ్చారు తుమ్మల. ఇందుకు రేవంత్ ను కూడా ఒప్పించినట్లుగా తెలుస్తోంది. పలు సమీకరణాలను ఉపయోగించి తన మిత్రుడికి టికెట్ ఇప్పించుకోవడమే కాదు…తన సామాజిక వర్గానికి తుమ్మల పెద్దపీట వేసుకోగలిగారనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. భట్టి, పొంగులేటిల మధ్య నలిగిపోతారనే అంచనాలను పటాపంచలు చేస్తూ.. ఖమ్మం రాజకీయాలపై తన మార్క్ ను ప్రదర్శించుకున్నారు తుమ్మల.