ఏపీలో ఉన్నతాధికారులు పూర్తిగా రాజకీయ కోణంలోనే తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగ ామారుతున్నాయి. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి మార్చేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరికి లెక్కలేనన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది అధికారుల్ని ముఠాగా మార్చి.. ఈసీపైనా ఒత్తిడి చేసేందుకు లేఖలు రాయిస్తున్నట్లుగా గుర్తించారు. తమను మార్చితే ఈసీ ప్రభావితం అయినట్లేనన్నట్లుగా నిందలు కూడా వేస్తున్నారు. ఈ అధికారుల తెలివి తేటల్ని ఈసీ అంత తేలికగా తీసుకోవడం లేదు.
సీఎస్ పదవి నుంచి జవహర్ రెడ్డిని తప్పించి వేరే రాష్ట్రానికి ఎన్నికల అబ్జర్వర్‌గా పంపే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. సీనియర్ ఐఏఎస్ రజత్ భార్గవ్, అనంతరాములు, ఆర్పీ సిసోడియా, నీరవ్ కుమార్ ప్రసాద్‌లు సీఎస్ రేసులో ఉన్నారు. పెన్షన్ల పంపిణీలో ఈసీ ఉత్తర్వులను వక్రభాష్యాలు చెప్పి చేసిన రాజకీయంతో 33 మంది వృద్ధులు చనిపోయారు. పది రోజుల పాటు పంచుతామని చెప్పారు. డబ్బులు లేకపోయినా వృద్ధుల్ని సచివాలయాలకు పిలిపించారు. వీటిపై మానవహక్కుల సంఘానికీ ఫిర్యాదులు అందాయి.
18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈలోగానే డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులను కూడా ఎన్నికల సంఘం మార్చే అవకాశముందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లపై వేటు వేసింది ఎన్నికల సంఘం. కొందరికి పోస్టింగులు ఇవ్వగా, మరికొందరిని పెండింగ్‌లో పెట్టింది. ఐపీఎస్ అధికారి రఘురామ్‌రెడ్డిని అస్సాం ఎన్నికల అబ్జర్వర్‌గా ఈసీ పంపింది.