geethanjali malli vachindi movie telugu review
తెలుగు360 రేటింగ్ : 2.25/5
-అన్వర్
‘ప్రేమకథా చిత్రమ్’తో తెలుగు ప్రేక్షకులకు’ హారర్ కామెడీ’ జోనర్ బాగా దగ్గరైయింది. ఆ తర్వాత ఈ తరహా ట్రీట్మెంట్ తో చాలా సినిమాలు వచ్చాయి. రచయిత, నిర్మాత కోనవెంకట్ పర్యవేక్షణలో వచ్చిన ‘గీతాంజలి’ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది. ఇప్పుడా సినిమాకి సీక్వల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి హారర్ కామెడీ.. ప్రేక్షకుల్ని నవ్వించి, భయపెట్టగలిగిందా?
తన తొలి సినిమా ‘గీతాంజలి’తో విజయం అందుకున్న దర్శకుడు సెనక్కాయల శ్రీను (శ్రీనివాస రెడ్డి) వరుసగా మూడు ఫ్లాపులు ఇస్తాడు. దీంతో సినిమా అవకాశాలు లేక ఇద్దరు ఫ్రెండ్స్ కలసి ఓ పెంట్ హౌస్ లో కథలు రాసుకుంటూ కలలు కంటూ కాలం గడుపుతుంతాడు. శ్రీను స్నేహితుడు అయాన్ (సత్య). శ్రీనుని నమ్మి హీరో అవుదామని హైదరాబాద్ వస్తాడు. అసలు సంగతి తెలుకొని నీరుగారిపోతాడు. ఇంక సినిమా ఫీల్డ్ వదిలివెళ్లిపోవాలని ఫ్రెండ్స్ అంతా నిర్ణయించుకున్న సమయంలో ఊటీలోని రిసార్ట్స్ యజమాని విష్ణు (రాహుల్ మాధవ్)నుంచి శ్రీనుకి ఓ సినిమా అవకాశం వస్తుంది. తను రాసిన కథని శ్రీనుతో చెప్తాడు విష్ణు. దానికి అనువైన లొకేషన్ కూడా చూపిస్తాడు. ఆ లొకేషన్ పేరు సంగీత్ మహల్. అదొ కొండపైన వుంటుంది. సంగీత్ మహల్లో శాస్త్రి (రవిశంకర్), ఆయన భార్య (ప్రియా)కూతురు మోహాని ఆత్మలు తిరుగుతున్నాయని బయట కథలుగా చెబుతుంటారు. అవేవీ లెక్క చేయకుండా అక్కడే షూటింగ్ పెట్టాలని శ్రీనుని ఒప్పిస్తాడు విష్ణు. అక్కడ కేఫ్ నడుపుతున్న అంజలిని హీరోయిన్ గా ఒప్పిస్తారు. అంజలి షూటింగ్ లో జాయిన్ అయ్యాక ఏం జరిగింది? అక్కడ నిజంగానే దెయ్యాలు వున్నాయి? సంగీత్ మాల్ కి వున్న గతం ఏమిటి ? ఈ కథకు గీతాంజలి(అంజలి) ఆత్మకు ఉన్న సంబంధం ఏమిటి? ఇవన్నీ తెరపై చూడాలి.
కోనవెంకట్ చేయి తిరిగిన రచయిత. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ కోసం ఆయన అనుకున్న బేసిక్ ఐడియా బావుంది. ఆ మాత్రం ఐడియాతో ఇలాంటి హారర్ కామెడీని సజావుగానే నడపొచ్చు. ఇలా నడపాలంటే ప్రేక్షకులని ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే వుండాలి. సీన్లు, హ్యుమర్ లో కొత్తదనం వుండాలి. కానీ ఇందులో అవే లోపించాయి. అసలు కథ ఓపెన్ చేయడానికే ఇంటర్వెల్ వరకూ సమయం తీసుకున్నారు. అప్పటివరకూ కథ ఏమిటో రిజిస్టర్ చేయకపోవడం, పాత్రల మధ్య ఎమోషన్ కుదరకపోవడం, సన్నివేశాలు ఊహకు అందిపోతూ పేలవంగా వుండటంతో తొలి సగం అంతా ఎదో రొటీన్ వ్యవహారంలానే వుంటుంది. ఇంటర్వెల్ కి ముందు వచ్చిన ట్విస్ట్ మాత్రం బాగానే కుదిరింది.
సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాయి. డీవోపీగా సునీల్ పాత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాత జరిగిన సినిమా షూటింగ్, దెయ్యాలతో యాక్ట్ చేయించిన సన్నివేశాలు నవ్విస్తాయి. మెథడ్ యాక్టింగ్, మలయాళం యాక్టింగ్ పేరుతో సత్య కాసేపు విజ్రుంభిస్తాడు. ఏడుపులు ఎన్ని రకాలుగా వుంటాయో చెప్పే సీన్ సుధీర్గంగా ఉన్నప్పటికీ సత్య తన టైమింగ్ తో లాక్కొచ్చేస్తాడు. అయితే క్లైమాక్స్ కి వచ్చేసరికి మళ్ళీ తేలిపోయింది గీతాంజలి. ఆ క్లైమాక్స్ లో ఏం జరిగిందో కొంతమందికి సరిగ్గా అర్ధం కూడా కాదు. అర్ధమైన వాళ్ళు మాత్రం ఇంత లాజిక్ లెస్ గా ఎలా తీశారని ఆశ్చర్యపోయేలా వుంటుంది.
అంజలికి 50వ సినిమా ఇది. టైటిల్ రోల్ ఆమెదే కానీ ఇందులో ఆమె పాత్రని ఇన్ యాక్టివ్ చేసేశారు. ఆత్మకు తప్పితే ఆమెకు కథలో ప్రాధాన్యత లేనట్లే. క్లైమాక్స్ లో వచ్చే ఎపిసోడ్ లో మాత్రం పవర్ ఫుల్ గా చూపించారు. అయితే సినిమా అంతా ఆమె ఆత్మని బొమ్మలో బంధించేయడం మాత్రం కథకు మేలు చేయలేదు. అవకాశం కోసం ఎదురుచూసే దర్శకుడి పాత్రలో శ్రీనివాస్ రెడ్డి భాధ్యతగానే కనిపించారు. సత్యం రాజేష్, షకలక శంకర్ సింగిల్ లైనర్స్ అక్కడక్కడా పేలాయి. సత్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇందులో పాజిటివ్ ఏదైనా వుందా అంటే అది సత్య నటన. వీరనటుడిగా ఓదిగిపోవాలనే తన ఆత్రుత చాలా చోట్ల నవ్విస్తుంది. సునీల్ చాలా రోజుల తర్వాత ఇలాంటి నవ్వించే పాత్ర చేశారు. సునీల్ వచ్చిన తర్వాతే కథలో హ్యుమర్ వస్తుంది. రవిశంకర్, సంగీత్ మహల్ ట్రాక్ ని కథలో బ్లెండ్ చేయలేకపోయారు. ఆయన నటన మాత్రం మెప్పిస్తుంది. రాహుల్ యాదవ్ నటన డీసెంట్ గా వుంది. అలీ ఓ సీన్ లో నవ్వించే ప్రయత్నం చేశారు. ఆయన పాత్ర సినిమా అంతా పోస్ట్ మ్యాన్ లా తిరుగుతుంటుంది. మిగతా అందరూ పరిధిమేర కనిపించారు.
సాంకేతికంగా సినిమా యావరేజ్ గానే వుంది. నేపధ్య సంగీతం హారర్, ఫన్ ని అంతగా ఎలివేట్ చేయలేకపోయింది. పాటలు అనవసరం. మంచి కామెడీ పండే చోట కూడా ఒక అనవసరమైన పాట వేశారు. కెమరాపనితనం డీసెంట్ గా వుంది. ఊటీ లోకేషన్స్ కలర్ ఫుల్ గా వున్నాయి. సంగీత్ మహల్ లొకేషన్ కూడా బాగానే పట్టుకున్నారు. డైలాగ్స్ సోసోగానే వున్నాయి. సినిమా ఫీల్డ్ మీద వేసుకున్న కొన్ని జోకులు మాత్రం నవ్విస్తాయి.
హారర్ కామెడీల్లో కూడా ఎమోషన్, డ్రామా, కాన్ ఫ్లిక్ట్ కుదిరితేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ సీక్వెల్ లో అదే మిస్ అయ్యింది. ‘ఈ రోజుల్లో కథలు ఎవరు అడుగుతున్నారు ? కాన్సెప్ట్ వుంటే చుసేస్తున్నారు’ అనే డైలాగ్ వుంది ఇందులో. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ లో కూడా ‘దెయ్యం వెర్సస్ దెయ్యం’ కాన్సెప్ట్ వుంది. కానీ ఇదివరకే ఈ కాన్సెప్ట్ తో సినిమాలు తీసేశారు. ప్రేక్షకులు చూసేశారు.
తెలుగు360 రేటింగ్ : 2.25/5
-అన్వర్