మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోపం వచ్చింది. తనను మీడియా చిట్ చాట్లలో షిండేగా మారుస్తూ.. పార్టీలో చీలిక తెస్తానన్నట్లుగా మాట్లాడుతున్న బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ హరీష్ రావుపై ఒక్క సారిగా ఫైరయ్యారు. వీరిద్దరూ చేస్తున్న ప్రకటనలతో.. తన పై కాంగ్రెస్ లో అపనమ్మకం పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్నారేమో కానీ.. వెంటనే.. రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని ప్రకటించేశారు. కాంగ్రెస్ లో గ్రూపులు లేవని.. రేవంత్ పదేళ్ల పాటు సీఎంగా ఉంటారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కవ కాలం ఉండదని చెప్పేందుకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎక్కవగా కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. కోమటిరెడ్డితో పాటు ఖమ్మం మంత్రి పొంగలేటి సుధారకర్ రెడ్డినీ కలిపేసుకుంటున్నారు. వీరిద్దరిలో ఒకరు షిండే అవుతారని.. బీజేపీతో కలుస్తారన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది వీరిద్దరిపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నది. కోమటిరెడ్డి గతంలో రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించి ఉండటంతో మరింత ఎక్కువగా ఆయనపై అనుమానాలు కలుగుతున్నాయి.
తనను షిండేతో పోలుస్తూ.. చేసే ప్రచారాలు మరింత పెరిగితే..తనపై కాంగ్రెస్ లో నమ్మకం సడలిపోతుందని.. మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనగతో గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు కోమటిరెడ్డి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఆయన ఇంకో సారి ఎవరైనా తన పేరు ప్రస్తావనకు తెచ్చి షిండే అని అంటే తిట్లందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.