ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ లో ఉన్న నాయకుడే. నిర్మల్ లో బీజేపీ నుండి గెలిచి, బీజేపీ ఎల్పీ లీడర్ గా కొనసాగుతున్న నాయకుడు.
మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుండి యాంటీ రేవంత్ రెడ్డి బ్యాచ్ గా ముద్రపడింది. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ వచ్చింది మొదలు అసంతృప్తి రాగం తీస్తూ, రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన సీనియర్లతో చేతులు కలిపి ఢిల్లీకి ఫిర్యాదులు ఇలా అన్నింట్లోనూ ఉన్నారు. పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను పంపించటంలో ఉన్న గ్రూపులో ఈయన కూడా ఒకరు అన్నది ఓపెన్ సీక్రెట్. అంతేందుకు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ హోదాలో రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు పూనుకుంటే… నేను చేస్తానని ప్రకటించి రెండు మూడు రోజులు చేసి గప్ చుప్ కూడా అయ్యారు. కట్ చేస్తే, బీజేపీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక దాదాపు నాలుగు నెలల పాలనలో కొత్త ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రాలేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి సూటుకేసులు మోస్తున్నారని కేటీఆర్ విమర్శలు మొదలుపెట్టినా అవి రాజకీయ విమర్శలుగానే ఉన్నాయి. కానీ, కొంతకాలంగా ఏలేటి మరోసారి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ కామెంట్ చేయటంతో పాటు ఏక్ నాథ్ షిండేలున్నారని, రేవంత్ సర్కార్ కూలిపోతుందంటూ కొత్త పల్లవి మొదలుపెట్టారు.
తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ పై అవినీతి ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హెటిరో డ్రగ్స్ అధినేత, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ పార్థసారథి రెడ్డి గ్రూపుకు 1500కోట్ల విలువ చేసే 15ఎకరాలు 2లక్షలకు ఎకరం చొప్పున కట్టబెట్టారని… దీనిపై అప్పుడు విమర్శించి, అధికారంలోకి రాగానే వెనక్కి తీసుకున్న ప్రభుత్వం… అదే భూమిని 15లక్షలకు ఎకరం చొప్పున అదే కంపెనీకి ఇచ్చిందని సంచలన ఆరోపణ చేశారు. ఈ డీల్ తో దాదాపు 300కోట్లు చేతులు మారాయని, ఆ డబ్బును రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపారన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పిదాలను ఎత్తిచూపుతూ… రేవంత్ రెడ్డి సెటిల్మెంట్స్ చేస్తున్నారన్నారు. అంతేకాదు అతి త్వరలోనే మరిన్ని ఆధారాలతో మరో అవినీతిని కూడా బయటపెడతానంటూ ఏలేటి చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారగా… ఏళ్లనాటి శని ఎలాగైతే పోదో, ఏలేటి కూడా మా రేవంత్ ను ఇంకా వదలుతలేడు అంటూ రేవంత్ టీం కామెంట్ చేస్తోంది.