2004లో “ఇండియా షైనింగ్” అంటూ అటల్ బిహారీ వాజ్ పేయి ఆధ్వర్యంలో బీజేపీ మొదలు పెట్టిన అడ్వర్టైజింగ్ క్యాంపైన్ ఇప్పటికీ ఒక కేస్ స్టడీ! వాజ్ పేయి ప్రభుత్వం మళ్ళీ అధికారంలో కి రాకపోవడానికి ఈ ఇండియా షైనింగ్ కూడా ఒక కారణం గా చెప్తారు. అసలు నిజాన్ని దాచిపెట్టి, ఆ నాడు దేశం లో వున్న పరిస్థితికి భిన్నంగా వీరి ప్రచారం జరిగింది అని చెప్తారు. ఈ రెండు దశాబ్ధాల కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఎవరూ అంచనా వేయలేని స్థితికి బీజేపీ ఎదిగింది.. అలానే అసలు ఊహాకి అందని స్థాయికి సోషల్ మీడియా పుట్టి పెరిగింది.
ఈ మధ్య కాలంలో “వార్ రుక్వా ది పాపా”.. అంటూ బీజేపీ చేసిన క్యాంపెయిన్ బానే ట్రోల్ అవుతోంది. ఎంతలా అంటే ఆ యాడ్ లో నటించిన ప్రియాంక అనే చిన్న ఆర్టిస్ట్ కనీసం ఇంట్లో నుంచి బయటకి రావడానికి భయపడేలా!
మొన్న ఆ మధ్య అప్పటి తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ “మన ప్రధాని మోడీ రష్యా ఉక్రైన్ మధ్య యుద్ధాని ఆపించారు”.. అని ప్రసంగాలు చేసి బాగా ట్రోల్ అయ్యారు. అదే కాన్సెప్ట్ తో వచ్చిన క్యాంపెయినే ఈ ‘వార్ రుక్వా ది పాపా’. రష్యా ఉక్రైన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు చాలా మంది భారతీయ విద్యార్ధులు ఉక్రైన్ లో చిక్కుకు పోవడం.. అతి కష్టం మీద వారు మళ్ళీ తిరిగి రావడం, ఈ మొత్తాన్ని బీజేపీ తన ప్రచారానికి వాడుకోవడం తెలిసిన విషయమే. అదే ఇతివృత్తం గా ఇప్పుడు ఈ ఎన్నికల కోసం యాడ్ ల ను తయారు చేశారు. కానీ ఈ యాడ్ రిలీస్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియా లో తెగ మీమ్ లు మొదలయ్యాయి. అలా పక్క దేశాలలో యుద్ధాన్ని ఆపే శక్తి వున్న మోడీ, స్వంత దేశం లో చిన్న చిన్న సమస్యలు ఎందుకు తీర్చలేకపోతున్నారు.. మణిపూర్ తగలాడిపోతుంటే ఏం చేశారు.. మన దేశంలో ఊచకోత జరుగుతుంటే ఎందుకు నోరు మెదపలేదు అంటూ ప్రశ్నలు సందిస్తున్నారు. ఈ వ్యతిరేకత తట్టుకోలేక బీజేపీ ఆ ప్రకటనను వెంటనే ఆపేసింది కూడా. కానీ నేటి సోషల్ మీడియా కాలం లో ఒక్కసారి ఒక వీడియో వస్తే.. శాశ్వతంగా ఉండిపోవడం ఖాయం.
ఈ యాడ్ ను కేవలం ప్రతిపక్ష పార్టీ నేతలే కాక సామాన్యులు కూడా ట్రోలింగ్ కు ఉపయోగించడం మొదలు పెట్టారు. బీజేపీని, మోడీని ఆ పార్టీ నాయకులని ట్రోల్ చేయడం తో పాటు అందులో నటించిన ప్రియాంకను కూడా తెగ టార్గెట్ చేస్తున్నారు. ఆఖరికి చాలా మంది నెటిజెన్ లు ఆ నటి ఇన్ స్టా అకౌంటు ను టాగ్ చేసి ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ ట్రోలింగ్ దాటికి తట్టుకోలేక ప్రియాంక ఆఖరికి తన ఇంస్టాగ్రామ్ ఖాతాను మూసివేసింది కూడా!
ఆ ట్రోలింగ్ అక్కడి తో ఆగలేదు. ఆ అమ్మాయి బయటకి అడుగుపెడితే ఆమెను రోడ్డు మీద ఆపి మరీ వేధిస్తున్నారట. ఇది భరించలేక ఇప్పుడు ప్రియాంక ఇంట్లో నుంచి బయటకి రావడం మానేసిందని ప్రియాంక స్నేహితులు ట్విటర్ (x) వేదిక గా చెప్పుకొచ్చారు.
ఈ క్యాంపెయిన్ వల్ల బీజేపీకి ఏ మాత్రం కలిసివస్తుందో తెలియదు కానీ.. ఒక నటి కెరియర్ మొదలు కూడా కాకముందే ముగిసిపోయిందని అందరూ అనుకుంటున్నారు.