వైకపా నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా గత శాసనసభ సమావేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అనుచితంగా వ్యవహరించినందుకు సభ నుండి ఏడాది కాలంపాటు సస్పెండ్ చేయబడటం, ఆ తరువాత జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. తనపై విదించబడిన సస్పెన్షన్ న్ని ఎత్తివేయించుకోవడానికి ఆమెకు అనేక అవకాశాలు ఉన్నప్పటికీ ఆమె వాటిని ఉపయోగించుకోకుండా, ఈ సమస్యపై తెదేపా ప్రభుత్వంతో పోరాటానికే మ్రోగ్గు చూపారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా స్పీకర్ తో మాట్లాడి ఆమెపై సస్పెన్షన్ న్ని ఎత్తివేయించడానికి ప్రయత్నించకుండా పోరాటానికే మ్రోగ్గు చూపారు కనుక, పార్టీ ఆదేశాల మేరకే ఆమె తనపై విదించిన సస్పెన్షన్ ఎత్తివేయించుకోవడానికి ప్రయత్నించలేదని అనుమానించవలసి వస్తోంది.
అయితే దాని కోసం ఆమె సుప్రీం కోర్టుని ఆశ్రయించడం గమనిస్తే, ఆమె సస్పెన్షన్ ఎత్తివేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా లేకపోతే ఈ సమస్యను మీడియాలో వచ్చేలా చేసి దానిపై విస్తృతంగా చర్చ జరిగేలా చేయడం ద్వారా వ్యక్తిగతంగా తనకు, పార్టీకి ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆమె లేదా ఆమె తరపున వైకాపా సభ్యులు గానీ స్పీకర్ కి క్షమాపణలు చెప్పుకొని ఆమెపై విదించబడిన సస్పెన్షన్ ఎత్తివేయించుకోవచ్చును కానీ, ఆవిధంగా చేసినట్లయితే వారు తమ తప్పును ఒప్పుకొన్నట్లవుతుంది. అప్పుడు తెదేపా సభ్యులు సభలో అవకాశం చిక్కినప్పుడల్లా ఆ ప్రస్తావన చేస్తూ ఆమెను, వైకాపాను కూడా ఇబ్బందిపెడుతూనే ఉంటారు. అదే న్యాయస్థానాలను ఆశ్రయించినట్లయితే, ఈ కేసు గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడల్లా దానిపై ఈవిధంగా ఎంతో కొంత చర్చ జరుగుతూనే ఉంటుంది. దాని వలన ఆమెకి, వైకాపాకి కూడా ఉచిత ప్రచారం, సానుభూతి లభిస్తాయి. అందుకే ఆమె తనపై విదించిన సస్పెన్షన్ న్ని ఎత్తివేయించుకోవడానికి తన చేతిలో ఉన్న అవకాశాలనన్నిటినీ వదులుకొని న్యాయపోరాటం చేస్తున్నారని అనుమానించవలసి వస్తోంది. ఆమె సస్పెండ్ అయ్యుంటేనే వైకాపా నేతలకు తెదేపాను విమర్శించే అవకాశం ఉంటుంది. నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ఆమె సస్పెన్షన్ ప్రస్తావన చేసి తెదేపాను విమర్శించడం గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది.
శాసనసభ నిబంధనలలో సెక్షన్:340 ప్రకారం తనను ఏడాదిపాటు సభ నుండి సస్పెండ్ చేయడం విరుద్దమని, కనుక తనను సస్పెండ్ చేస్తూ తెదేపా ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రద్దు చేయాలని కోరుతూ రోజా సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ లో తనను సస్పెండ్ చేసిన తెదేపా ప్రభుత్వాన్ని స్పీకర్ ని ప్రతివాదులుగా చేర్చకుండా శాసనసభ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి, కార్యదర్శుల పేర్లను చేర్చడం విశేషం.
ఆమెతో సహా సభలో అనుచితంగా వ్యవహరిస్తున్న మరో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలను కూడాసభ నుండి సస్పెండ్ చేయాలని ఈ వ్యవహారం కోసం స్పీకర్ ఏర్పాటుచేసిన అఖిలపక్ష కమిటీ సిఫార్సు చేసింది. అది మళ్ళీ ఈ నెల 14న సమావేశమవుతుంది. వైకాపా ఎమ్మెల్యేలు ముగ్గురినీ ఆ రోజున తమ ముందు హాజరయ్యి దీనిపై తమ వాదన, సంజాయిషీ చెప్పుకోవలసిందిగా కోరుతూ లేఖలు పంపినట్లు తెలుస్తోంది. కనుక తనపై విదించబడిన సస్పెన్షన్ రద్దు చేయించుకోవడానికి రోజాకి ఇంకా మరొక (ఆఖరి) అవకాశం మిగిలే ఉందని చెప్పవచ్చును. కానీ ఆమె న్యాయపోరాటానికే సిద్దం అయినందున ఆ అవకాశాన్ని కూడా ఆమె వినియోగించుకోకపోవచ్చును.